రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు కోలాహలంగా సాగుతున్నాయి. వేడుకల్లో రాష్ట్ర ప్రముఖులు సైతం పాల్గొని ఏకదంతున్ని ప్రసన్నం చేసుకున్నారు. హైదరాబాద్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతికి తొలిపూజ.. గవర్నర్ తమిళిసై, హరియాణా గవర్నర్ దత్తాత్రేయ కలిసి నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు తమిళిసై వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతికి తొలిపూజ చేయడం తన అదృష్టమని గవర్నర్ తెలిపారు. కరోనా మహమ్మారిని పారదోలాలని విఘ్నేశ్వరున్ని వేడుకున్నారు.
ఏకదంతుడు తరిమికొడతాడు..
"ఖైరతాబాద్ గణేశుడి ప్రత్యేకత నాకు చాలా నచ్చింది. ఇక్కడ తొలిపూజ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ గణపయ్య తప్పకుండా కరోనా మహమ్మారిని తరిమికొడతాడు. దేవుడున్నాడు కదా అని.. మనం అజాగ్రత్తగా ఉండొద్దు. దర్శనానికి వచ్చే ప్రతిఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలి. వీలైనంత త్వరగా అందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి." - తమిళిసై సౌందరరాజన్, గవర్నర్
ప్రగతిభవన్లో చవితి వేడుకలు..
వినాయక చవితి పండుగను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగతి భవన్ అధికారిక నివాసంలో వైభవంగా జరుపుకున్నారు. సీఎం కేసీఆర్, శోభ దంపతులు గణనాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రగతిభవన్లో ప్రతిష్ఠిచిన మట్టి గణపతికి పూజలు చేసి ప్రసన్నం చేసుకున్నారు. పూజా కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్, మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్భవన్లో గణేశునికి పూజలు..
హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉత్సవాలకు హాజరయ్యారు. పార్టీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. బొజ్జగణపయ్యకు చంద్రబాబు, తెలుగుదేశం నేతలు పూజలు చేశారు.
బొజ్జగణపయ్య సేవలో భాజపా నేతలు..
భాజపా రాష్ట్ర కార్యాలయంలో వినాయక చవితిని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సతీసమేతంగా పూజల్లో పాల్గొన్న కిషన్ రెడ్డికి అర్చకులు ఆశీర్వచనాలు ఇచ్చారు. తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కిషన్ రెడ్డి... ప్రజలు తలపెట్టిన అన్ని కార్యక్రమాలు నిర్విగ్నంగా జరగాలని ఆకాంక్షించారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే శక్తిశాలి దేశంగా తయారు చేసేలా ప్రధాని మోదీని ఆశీర్వదించాలని గణనాథుడిని కిషన్రెడ్డి వేడుకున్నారు. అనంతరం ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్.. సంగారెడ్డి జిల్లా జోగిపేట మండలం సంగుపేటలో గణేశ్చతుర్థి వేడుకలు జరుపుకున్నారు. గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు.
ఇదీ చూడండి: