Telangana RTC Income Per Day : ఛార్జీల పెంపుదలకు ముందే తెలంగాణ ఆర్టీసీ అధికారులు అదనపు వడ్డింపులు చేపట్టారు. వీటి ద్వారా ప్రస్తుతం వస్తున్న ఆదాయానికి అదనంగా రోజుకు సుమారు రూ.కోటికి పైగా సమకూరనుంది. గడిచిన అయిదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఛార్జీల పెంపుదల దస్త్రమూ కదులుతున్నట్లు సమాచారం.
Telangana RTC Income : చిల్లర సమస్యను అధిగమించేందుకు అధికారులు ఛార్జీలను సవరించారు. ఉదాహరణకు రూ.11 గా ఉన్న ఛార్జీని రూ.10గా, రూ.13గా ఉన్న మొత్తాన్ని రూ.15గా రౌండాఫ్ చేశారు. జాతీయ రహదారుల సంస్థ టోల్ ఛార్జీలను పెంచనప్పటికీ ఆ పేరుతో, రక్షణ ఛార్జీల పేరుతో ఒక రూపాయిని అధికారులు పెంచారు. ఈ రెండింటి ద్వారా ఆర్టీసీకి పెద్దమొత్తంతో అదనపు ఆదాయం రానుంది. ప్రస్తుతం రోజుకు సగటున రూ.12 కోట్ల ఆదాయం వస్తోంది. తాజా వడ్డనలతో రూ.13 కోట్లు దాటుతుందని అధికారుల అంచనా.
ఛార్జీలు పెంచితే రూ. వెయ్యి కోట్లకు పైగా..
ఛార్జీల పెంపుదల దస్త్రానికి త్వరలో మోక్షం లభిస్తుందని, కిలోమీటరుకు 20 పైసల వరకూ పెంచే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మూడు రకాల ప్రతిపాదనలతో కూడిన దస్త్రాన్ని అయిదు నెలల కిందటే ప్రభుత్వానికి పంపారు. ఛార్జీల పెంపుదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి లభిస్తే ఏటా రూ.వెయ్యి కోట్లకుపైగా అదనపు ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఏటా భారీగా నష్టాలు నమోదవుతున్న నేపథ్యంలో ఛార్జీల పెంపుతో ఆర్టీసీ కొంతమేరకు గాడిలో పడుతుందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
- ఇదీ చదవండి : బస్సుల్లో టికెట్ ధరలు రౌండప్ చేసిన ఆర్టీసీ