తెలంగాణ రాష్ట్ర ప్రయాణం అనుకున్న రీతిలో ఎంతో ఆశావహంగా ప్రారంభమైందని... రాష్ట్ర వ్యవసాయం దేశంలోనే అగ్రగామిగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్కు వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం ప్రగతి భవన్లో జాతీయ పతాకావిష్కరణ చేశారు.
ఆ గోస ఇప్పుడు లేదు
సొంత రాష్ట్రం ఏర్పడితే ఏ సమస్యలు తీరుతాయని ఆశించామో, ఆ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పడే నాటికి రైతుల పరిస్థితి, వ్యవసాయం పరిస్థితి దారుణంగా ఉండేదని, నేడు తెలంగాణ వ్యవసాయం దేశంలోనే అగ్రగామిగా ఉందని అన్నారు. ఎండాకాలం వస్తే ప్రజలు మంచినీళ్ల కోసం గోస పడేవారని, నేడు మిషన్ భగీరథతో ఆ సమస్య పరిష్కారం అయిందని సీఎం తెలిపారు.
పునరంకితం అవుతుంది
విద్యుత్, సాగునీరు, విద్య, వైద్య, పారిశ్రామిక, ఐటీ తదితర రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామని సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి... తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పాటు పడడం కోసం ప్రభుత్వం పునరంకితం అవుతుందని ప్రకటించారు.
ఇదీ చదవండి: జయహో తెలంగాణ.. అమరులకు సీఎం నివాళులు