Telangana National Unity Day : హైదరాబాద్ ప్రాంతం భారత యూనియన్‌లో కలిసి 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిపాటు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహిస్తోంది. ఉత్సవాల ప్రారంభ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారమే అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేశారు.
Telangana National Unity Day Celebrations : సెప్టెంబర్ 17న భారత యూనియన్‌లో చేరిన సందర్భంగా... ఇవాళ 'తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని' నిర్వహిస్తున్నారు. రాజధాని హైదరాబాద్‌లో ప్రధాన కార్యక్రమం జరగనుంది. పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు బలగాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. అనంతరం వేదికపై నుంచి సీఎం ప్రసంగిస్తారు.
Telangana Liberation Day Celebrations by TRS : అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రముఖులు జాతీయ జెండా ఎగరవేసి గౌరవవందనం స్వీకరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ, గ్రామీణ స్థానికసంస్థల పరిధిలోని కార్యాలయాల్లోనూ జాతీయజెండా ఎగరవేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఇవాళ సాధారణ సెలపు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు.
చారిత్రక సెప్టెంబర్ 17 సందర్భంగా గిరిజనుల ఆత్మగౌరవ భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. బంజారాహిల్స్‌లో నిర్మించిన సేవాలాల్ బంజారా భవన్, కుమ్రంభీం ఆదివాసీ భవన్‌లను మధ్యాహ్నం ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. దాదాపు ఆరు వేల మంది కళాకారులతో సీఎంకు ఘనంగా స్వాగతం పలకనున్నారు. భవనాల ప్రారంభం సందర్భంగా పీపుల్స్ ప్లాజా నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు గిరిజన కళారూపాలతో భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. గుస్సాడీ, గోండు, లంబాడీ తదితర 33 రకాల కళారూపాలు ప్రదర్శించే కళాకారులు భారీ ర్యాలీలో పాల్గొంటారు.
అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే ఆదివాసీ, బంజారా ఆత్మీయసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి గిరిజన ప్రజాప్రతినిధులు, ఉద్యోగసంఘాల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, ప్రముఖులను సభకు ఆహ్వానించారు. వారు వచ్చేందుకు వీలుగా జిల్లాల నుంచి ప్రత్యేకంగా బస్సులు, వాహనాలు ఏర్పాటు చేశారు. పద్మశ్రీ అవార్డు పొందిన కనకరాజు, రామచంద్రయ్యలకు కోటి రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పోలీసు అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.