Swachh Autos Distribution : ముఖ్యమంత్రి దిశానిర్దేశంతో హైదరాబాద్‌ను స్వచ్ఛనగరంగా తీర్చిదిద్దుతున్నామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీలో మరో 1350 స్వచ్ఛ ఆటోల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఖైరతాబాద్‌లో ఆటోల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసానితో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఆరేళ్లలో హైదరాబాద్‌లో చెత్త సేకరణ ఎంతగానే మెరుగుపడిందన్న కేటీఆర్... అందుకు సహకరిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి అభినందనలు తెలిపారు..
Minister KTR News Today : "సఫాయి అన్నా.. నీకు సలామ్ అన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. పారిశుద్ధ్య కార్మికులకు గౌరవం ఇవ్వడమే కాదు వారికి గౌరవ ప్రదమైన వేతనం అందించిన ఘనత కేసీఆర్‌దే. ఇంటింటికి తిరిగి చెత్త సేకరించి.. తడి, పొడి చెత్త వేరుచేసి డంప్‌యార్డుకు తరలిస్తున్నారు. నగరంలో 4500 స్వచ్ఛ ఆటోలను చెత్త సేకరణకు ఉపయోగిస్తున్నాం."
- కేటీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి
Minister KTR Today News : జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో దక్షిణ భారత దేశంలోనే అతిపెద్దదైన వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ జవహర్‌నగర్‌లో ప్రారంభించామని కేటీఆర్ తెలిపారు. మరో ప్లాంట్‌కు అనుమతులు కూడా వచ్చాయని చెప్పారు. త్వరలోనే 48 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే మరో ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. నగరంలో ప్రజాప్రతినిధులు విస్తృతంగా పర్యటించి ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాలని సూచించారు. భాగ్యనగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.