తెలంగాణ-ఏపీ జలవివాదంపై రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister srinivas Goud) స్పందించారు. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని ఆలోచిస్తున్నానని.. వారిని ఇబ్బంది పెడతారనే ఎక్కువగా మాట్లాడట్లేదన్న ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. జగన్ అలా మాట్లాడటం బాధాకరమన్నారు. గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలిచ్చినా ఖాతరు చేయకుండా.. కేంద్ర మంత్రికి ఇచ్చిన మాటను పెడచెవిన పెట్టి అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టారని ఆరోపించారు. మిగులు జలాల పేరుతో పాలమూరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. 44వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
తెలంగాణ వచ్చాక ఏపీ వాసులను ఇబ్బంది పెట్టలేదని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఏపీకి చెందిన ఉద్యోగులు, వ్యాపారులు, కాంట్రాక్టర్లందరి కోసం కేసీఆర్ ఆలోచించారని తెలిపారు.
కరోనా కాలంలో ఆక్సిజన్ కోసం విశాఖకు వెళ్తే స్టీల్ ప్లాంట్ బంద్ చేశారు. అక్కడ పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను అవమానపరిచారు. తెలంగాణ బస్సులను డిపోల్లోకి రానీయకపోతే.. రోడ్లమీద పెట్టుకుని మా డ్రైవర్లు బస్సులోనే నిద్రపోయారు. తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్తే అక్కడి అధికారి నన్ను అవమానపరిచాడు. అయినా మేమేం మాట్లాడలేదు. అన్నీ కడుపులోనే పెట్టుకున్నాం. ఇక్కడి ఏపీ ప్రజల కోసం మేం అన్నీ భరించాం. అక్రమంగా ప్రాజెక్టును మొదలు పెట్టడమే కాకుండా.. తిరిగి తెలంగాణను ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం. నిజంగా ఏపీ ప్రభుత్వానికి ప్రజలపై ప్రేముంటే.. ఈ ప్రాజెక్టును తాత్కాలికంగా ఆపేయండి. మీ వాటా ఏంటో తేల్చుకుని.. అన్ని అనుమతులు తీసుకుని అప్పుడు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టండి.
- శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి
కృష్ణాబేసిన్‌లో తాగునీటి అవసరాలు తీర్చకుండా.. పెన్నా పరివాహకానికి మంచినీళ్లు కావాలని అడగటం ఎంతవరకు సమంజసమని మంత్రి ప్రశ్నించారు. శ్రీశైలం పూర్తిస్థాయిలో జల విద్యుత్ ప్రాజెక్టని గతంలో ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చిందని, అలాంటి హైడల్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని ఆపమని ఎలా అంటారని నిలదీశారు. తాగునీరు, సాగునీరు పేరిట వందల టీఎంసీల కృష్ణాజలాలు తీసుకువెళ్తే.. పాలమూరు జిల్లా ప్రజలు ఏం కావాలని ఎదురుదాడికి దిగారు. హైదరాబాద్‌లో ఉండే సీమాంధ్రులు.. తెలంగాణకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు.