యువ కథానాయకుడు సుధీర్‌బాబు మంత్రి కేటీఆర్‌పై సరదాగా పంచ్‌లు వేశారు. కేటీఆర్‌లో రాజకీయ నాయకుడి కంటే నటుడు బాగా కనిపిస్తారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ హైటెక్స్‌లో జరుగుతున్న ఇండియా జాయ్ కార్యక్రమానికి సుధీర్‌బాబు హాజయ్యారు. వేడుక ప్రారంభ కార్యక్రమంలో కేటీఆర్‌ను ప్రశంసిస్తూ సరదాగా వ్యాఖ్యలు చేసి, దానికి వివరణ కూడా ఇచ్చారు. సుధీర్‌బాబు మాటలు విన్న కేటీఆర్.. నవ్వుతూ ఆ మాటలను తను మనసులో పెట్టుకుంటానని చమత్కరించారు. కేటీఆర్ ప్రతిస్పందనతో సుధీర్ బాబు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇరువురు మధ్య జరిగిన సంభాషణలు... ఇండియా జాయ్‌లో కొద్దిసేపు నవ్వులు పూయించాయి. సుధీర్‌బాబు అలా ఎందుకు మాట్లాడారు? అతడికి కేటీఆర్ ఇచ్చిన కౌంటర్ ఏంటి?
సుధీర్ బాబు మాట్లాడుతూ.. ‘‘కేటీఆర్‌కు నేను పెద్ద అభిమానిని. ఒక మంచి రాజకీయ నాయకుడిలో ఒక మంచి నటుడు కూడా ఉంటాడు. ఒక నటుడు అన్నీ మరిచిపోయి పాత్రకు తగినట్లు నటించాలి. అలాగే రాజకీయ నాయకుడు కూడా ప్రజలకు మంచి చేయాలంటే తన గురించి తన కుటుంబం గురించి మరిచిపోయి పనిచేయాలి. అలాంటి వ్యక్తే కేటీఆర్. ఒకవేళ భవిష్యత్‌లో నేను రాజకీయ నాయకుడిగా నటించే అవకాశం వస్తే కేటీఆర్‌ను అనుసరిస్తా. ఆయనలాగే ఉండేందుకు ప్రయత్నిస్తా. కేటీఆర్ సినిమాల్లోకి రానందుకు ఆనందంగా ఉంది’’ అని అన్నారు.
సుధీర్‌బాబు మాటలు విన్న మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘సుధీర్ నన్ను అనుకోకుండా నటుడ్ని చేశాడు. నన్న పొలిటీషియన్ కంటే నటుడిగా బాగుంటావన్నాడు. ఏంటి సుధీర్..? నేను రాజకీయ నాయకుడి కాకుండా నటుడిగా కనిపిస్తున్నానా? ఓకే సుధీర్...! ఇది నేను మనసులో పెట్టుకుంటా! ఏది ఏమైనా ఈ విషయాన్ని నేను చాలా పాజిటివ్ వేలో చూస్తున్నా. ధన్యవాదాలు సుధీర్. నీ ప్రశంసను స్వీకరిస్తున్నా’’ అని అనడంతో నవ్వులు పూశాయి.
ఇదీచూడండి: CM KCR: 'ఉలుకు పలుకు లేకుంటే.. కేంద్రాన్ని వెంటాడి వేటాడుతాం'