వైరస్‌ను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ప్రభుత్వం వైద్య బృందాలను నియమించింది. ఎక్కడైనా పాజిటివ్ కేసులు నమోదయితే ఆ వెంటనే ఆ ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేసి, గృహాల వారీగా వివరాలు నమోదు చేయడం వారి విధి. అనుమానిత కుటుంబాల సభ్యులను క్వారెంటైన్‌లో ఉంచేలా చర్యలు చేపడుతున్నారు. సర్వే బృందంలో ఒక వైద్యుడు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్త, ఒక పోలీసు కానిస్టేబుల్, ఆ ప్రాంత ప్రజాప్రతినిధి ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఈ సందర్భంగా సర్వే సిబ్బంది ఇబ్బందులను చవిచూడాల్సి వస్తోంది.
- శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇంటింటి సర్వేకు వెళ్లిన వైద్య సిబ్బందికి ప్రతిఘటన ఎదురైంది. ఇక్కడ కరోనా పాజిటివ్‌తో ఓ వ్యక్తి మృతిచెందడంతో వంద వైద్య బృందాలతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. చిరునామా నమోదు సమయంలో ఆధార్‌కార్డు అడిగినందుకు ఓ ప్రజాప్రతినిధి సిబ్బందికి అడ్డుపడ్డారు.
- శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలో రెండు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తున్న ఆశా కార్యకర్త ను బెదిరించి నివేదిక దస్త్రాలను చించేశారు.
- హైదరాబాద్ నగరంలో ఓ ప్రాంతంలో సర్వే బృందాలు వెళ్లిపోవాలని స్థానికులు దురుసుగా సమాధానం ఇచ్చారు.
- ‘ఊరంతా తిరిగి మా ఇంటికి వస్తే మాకు వ్యాధులు సోకవా?’ అంటూ నాలుగు రోజుల క్రితం నిజామాబాద్‌లో సర్వే సిబ్బందిని అడ్డుకుని వివరాలు చెప్పటానికి నిరాకరించారు.
ప్రతికూల పరిస్థితుల్లోనూ విధులు
‘మాకు ప్రత్యేక వాహనాలు లేవు. మహిళలమైనా లాక్‌డౌన్‌లో ఆయా ప్రాంతాలకు చేరుకుంటున్నాం. ఎన్నికష్టాలు ఎదురైనా సేవల నుంచి వెనక్కు తగ్గం’ అని ఏఎన్‌ఎంల రాష్ట్ర సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు. సర్వే సిబ్బందికి ప్రభుత్వం రక్షణ చర్యలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలోని 23 జిల్లాలకు వ్యాపించిన వైరస్