కేంద్రం అనుమతించింది కదా! అని పంటలను కొందామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. అలాగని పంటలను కొనకుండా వదిలేద్దామా! అంటే వాటి పేరుతో బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునే అవకాశం ఉండదు. ఇదీ ‘రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య’(మార్క్‌ఫెడ్) మార్క్‌ఫెడ్ ప్రస్తుత పరిస్థితి. సమాఖ్య అప్పులు రూ.3600 కోట్లకు, నష్టాలు రూ.2600 కోట్లకు చేరడంతో రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తు లేకుండా కొత్తగా పైసా అప్పు పుట్టడం లేదు. మొత్తంగా ఆ సంస్థ రైతుల నుంచి మద్దతు ధరకు పంటలను కొనడం అటుంచి..ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే మార్గం లేక విలవిలలాడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా పంటను మద్దతు ధరకు కొనాలని నిర్ణయించే పక్షంలో రైతుల నుంచి నేరుగా వాటి తరఫున మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తుంది. గత అక్టోబరులో వానాకాలం పంటలు, ఇప్పుడు యాసంగి పంటలు మార్కెట్‌కు వస్తున్నాయి. సోయాచిక్కుడు, వేరుసెనగ, పెసర, మినుము, సెనగ పంటలను మద్దతు ధరకు కొనేందుకు కేంద్రం అనుమతించింది. మార్క్‌ఫెడ్ మాత్రం కేంద్రం తరఫున కేవలం సెనగ పంటను, అదీ కేవలం 15 వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. మిగతా పంటల దిగుబడిలో 25 శాతం కొనేందుకు కేంద్రం అనుమతించినా నిధులు లేవనే కారణంతో కొనుగోళ్లను అటకెక్కించింది.
లక్ష్యం ఒకటి.. చేసేది మరొకటి
వాస్తవానికి ఈ సంస్థ ఏర్పాటు లక్ష్యాల ప్రకారం ప్రభుత్వాల అనుమతితో సంబంధం లేకుండా నేరుగా మార్కెట్‌లో పంటలను కొనడం ద్వారా రైతులను ఆదుకోవాలి. ఆ పంటల తాలూకూ అనుబంధ ఉత్పత్తులు తయారుచేసి తిరిగి అమ్మి లాభాలు పొందాలి. ఏ ఒక్క ఏడాదిలోనూ సంస్థ ఇలా చేయలేదు. ప్రభుత్వాల పూచీకత్తుతో పంటల కొనడానికి అవసరమైన నిధులను బ్యాంకుల నుంచి రుణంగా తీసుకుంటోంది. ఆ సొమ్ములో కొంత పాత బాకీల కింద జమచేసి, మిగిలిన దానితో పంటలను కొనుగోలు చేస్తూ వస్తోంది. ఉదాహరణకు 2019-20 యాసంగిలో పండిన మొక్కజొన్నలను మద్దతు ధరకు కొనడానికిగానూ 2020 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పు తీసుకోవడానికి పూచీకత్తు ఇచ్చింది. ఆ మేరకు రూ.3,200 కోట్లను బ్యాంకుల నుంచి సమాఖ్య రుణంగా తీసుకుంది. వీటిలో రూ.1,660 కోట్లను రైతులకు మద్దతు ధర కింద చెల్లించి 9.47 లక్షల టన్నుల మొక్కజొన్న పంటను కొన్నది. తీరా అమ్మే సమయానికి ధర తగ్గడంతో రూ.900 కోట్ల నష్టాలొచ్చాయి. అంతకు ముందు ఉన్న నష్టాలన్నీ కలిపి ఇప్పుడు అవి రూ.2600 కోట్లకు చేరాయి.
చిల్లిగవ్వ లేదు.. రూ. కోట్లు చెల్లించేదెలా?
ఏ పంటను కొనడానికైనా బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటే ఏడాదిలోగా తిరిగి చెల్లించాలనే నిబంధన ఉంది. 2020లో తీసుకున్న రూ.3,200 కోట్ల రుణంలో రూ.1,540 కోట్లను సంస్థ పాత బాకీల కింద బ్యాంకులకే జమచేసింది. పాత బకాయిల్లో మరో రూ.1,500 కోట్లు వచ్చే నెలాఖరులోగా చెల్లించాలని బ్యాంకులు మార్క్‌ఫెడ్‌కు తాజాగా నోటీసులిచ్చాయి. ‘‘కట్టడానికి సంస్థ దగ్గర నిధుల్లేవు. 2020-21లో సెనగలు, మొక్కజొన్నలనే పరిమితంగా కొనడంతో రుణం తీసుకోవడానికి ప్రభుత్వం నుంచి పూచీకత్తు రాలేదు. దీంతో పాతబాకీలు కట్టలేక బ్యాంకుల ముందు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్లనే పంటలను మద్దతు ధరకు కొనలేకపోతున్నాం’ అని సీనియర్ అధికారి ఒకరు ‘ఈనాడు’కు వివరించారు. వేసంగిలో సాగైన మొక్కజొన్నలను మద్దతు ధరకు కొనడానికి అనుమతి ఇవ్వడంతోపాటు, బ్యాంకుల నుంచి కనీసం మరో రూ.3 వేల కోట్ల రుణాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వని పక్షంలో అటు రైతుల నుంచి నిరసనలు, ఇటు పాత బాకీలు కట్టలేక బ్యాంకుల నుంచి వేలం నోటీసులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: సరిహద్దుల్లో అంబులెన్స్‌లను అడ్డుకోవద్దు: హైకోర్టు