శాసన మండలి సమావేశాలు ఈ నెల 28 వరకు కొనసాగుతాయని.... ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సభ్యులు కోరినన్ని రోజులు సభ జరపడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. సభ్యులు సభ సమయాన్ని సద్వినియోగం చేసుకొని సమావేశాలు సక్రమంగా నడిపించేందుకు సహకారాన్ని అందించాలని కోరారు. మండలి తొలిరోజు సమావేశం వాయిదా అనంతరం మంత్రుల ఛాంబర్లో శాసనమండలి బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బి.ఎ.సి) సమావేశం జరిగింది.
సెప్టెంబరు 8న మాజీ ప్రధాని పి.వి నరసింహారావు శత జయంతి సందర్భంగా చర్చ ఉంటుందని పేర్కొన్నారు. ఆ రోజు నుంచి ప్రతి రోజూ ఉదయం మొదటి గంట పాటు ప్రశ్నోత్తరాల సమయం ఉంటుందని.. ఈ సమయంలో కేవలం 6 ప్రశ్నలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. జీరోఅవర్ అరగంట పాటు ఉంటుందన్నారు. తదనంతరం లఘు చర్చ కొనసాగుతుందని వివరించారు.
గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హోం మంత్రి మహమూద్ అలీ, ఛీప్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, విప్ బాను ప్రసాద్, ఎమ్మెల్సీలు జనార్దన్ రెడ్డి, జాఫ్రి, లెజిస్లేటివ్ సెక్రటరీ డా.వి నరసింహా చార్యులు హాజరయ్యారు.
ఇవీచూడండి: వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డుల స్వాధీనానికి ప్రభుత్వం ఆదేశం