KTR Inaugurates Bio Asia Summit 2022 : హైదరాబాద్ వేదికగా 19వ బయో ఆసియా సదస్సు ప్రారంభమైంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ సదస్సును వర్చువల్ వేదికగా ప్రారంభించారు. రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్‌లో.. ఇవాళ లైఫ్ సెన్సెస్, ఆరోగ్య రంగంలో కరోనా సవాళ్లపై చర్చిస్తున్నారు. కరోనా సృష్టించిన అడ్డంకులు- అవకాశాలు, భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం రాష్ట్ర మంత్రి కేటీఆర్.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మధ్య జరగనున్న చర్చపై ఈ ఏడాది సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. బిల్‌గేట్స్‌తో చర్చ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
ఏడాదిలో రూ.6400 కోట్ల పెట్టుబడులు..
Bio Asia Summit 2022 Begins Today : రెండు దశాబ్ధాలుగా లైఫ్ సైన్సెస్ రంగ అభివృద్ధిలో బయో ఆసియా సదస్సు క్రియాశీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్ల అభివృద్ధితో ఎంతో మంది ప్రాణాలు దక్కాయని తెలిపారు. గడిచిన ఏడాది కాలంలో హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రంగం 200 శాతం అభివృద్ధి చెందిందని చెప్పారు. ఏడాదిలో రూ.6400 కోట్ల పెట్టుబడులను రాష్ట్ర లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీ ఆకర్షించిందని వెల్లడించారు. తద్వారా 34 వేల ఉద్యోగాలు సాకారమైనట్లు వివరించారు.
లైఫ్ సైన్సెస్ రంగానికి వెన్నెముకగా జీనోమ్ వ్యాలీ
Bio Asia Summit 2022 in Hyderabad : "రాష్ట్ర లైఫ్ సైన్సెస్ రంగ అభివృద్ధికి జీనోమ్ వ్యాలీ వెన్నెముకగా నిలుస్తోంది. స్వదేశంలో ఉత్పత్తి అయిన కార్బివ్యాక్స్, కొవాగ్జిన్ టీకాలు జీనోమ్ వ్యాలీ నుంచి వచ్చినవే. మెజార్టీ ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌లో కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. వైద్య పరికరాలు తయారు చేసే కంపెనీలకు రాష్ట్రంలో మంచి భవిష్యత్ ఉంది. వచ్చే ఆరు నెలల్లో 7 మెడికల్ డివైజ్ కంపెనీలు తెలంగాణలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రూ.1500 కోట్ల పెట్టుబడులతో 50కి పైగా కంపెనీలు.. వైద్య పరికరాల తయారీ, ఆర్ అండ్ డీ సెంటర్లు నెలకొల్పాయి. వీటిద్వారా 7వేల ఉద్యోగాలు సాకారమయ్యాయి.జీవశాస్త్ర రంగాల్లో హైదరాబాద్ ఏవిధంగా ప్రభావం చూపుతోంది.. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా ప్రోత్సాహం అందిస్తుందనేది స్పష్టమవుతోంది."
- కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
ఈ సదస్సు సూచనలతో పురోగతికి బాటలు..
KTR About Bio Asia Summit 2022 : తెలంగాణ రాష్ట్ర పాలసీలు, మౌలిక వసతులు, ఎకో-సిస్టం, సాధించిన ప్రగతిని ప్రపంచానికి తెలియజేసేందుకు బయో ఆసియా సదస్సు ఓ అద్భుత వేదిక అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా ఇండస్ట్రీల పురోగతికి ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై ఈ సదస్సు సూచనలు ఉపయోగపడతాయని కేటీఆర్ అన్నారు.
కేంద్రం సహకారం అవసరం..
భారతీయ కంపెనీలు.. జనరిక్ డ్రగ్స్ ఉత్పత్తితో పాటు.. కాంప్లెక్స్ జనరిక్క్స్, బయోసిమిలర్స్, బయోలాజిక్స్, సెల్ అండ్ జీన్ థెరపీ, క్లినికల్ రీసెర్చ్ వంటి రంగాల్లో మరింత బలపడాల్సిన అవసరముందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. గ్లోబల్ స్కేల్‌ను చేరేందుకు భారత కంపెనీలు పోటీ పడాలని అన్నారు. వాల్యూ చైన్ వృద్ధికి కంపెనీలు, ప్రభుత్వాలతో కలిసి పని చేయాలని కోరారు. కేంద్రం పాలసీలు, రాయితీలు, రెగ్యులేటరీ రీఫార్మ్స్ అంశాల్లో వేగవంతమైన చర్యలు అవసరమని అన్నారు. ముఖ్యంగా రీఅంబర్స్‌మెంట్ స్కీమ్స్, డ్యూటీ స్ట్రక్చర్ కరెక్షన్, సపోర్ట్ టూ ఆర్ అండ్ డీ వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం కంపెనీలకు మద్దతు ఇచ్చి అవి సమర్థంగా పనిచేసేలా సహకారమందించాలని విజ్ఞప్తి చేశారు.