TS Intermediate Pass Percentage 2021 : ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత బాగా తగ్గిపోయింది. ఈసారి జనరల్, ఒకేషనల్ కలిపి 49 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది ఉత్తీర్ణత శాతం 60.01 కాగా ఈ ఏడాది 11 శాతం తగ్గింది. ఇంటర్ తొలి ఏడాది ఫలితాలను ఇంటర్‌బోర్డు గురువారం వెల్లడించింది. మొత్తం జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 5.59 లక్షల మందికి 2.24 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. జనరల్, ఒకేషనల్... రెండింటిలోనూ ఉత్తీర్ణత శాతం సమానంగా రావడం గమనార్హం.
పరీక్షలపై అస్పష్టతే కారణం!
Telangana Intermediate Pass Percentage 2021 : గతంలో ఎన్నడూ లేనంతగా ఉత్తీర్ణత శాతం పడిపోవడానికి పరీక్షలపై అస్పష్టతే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 2020-21 విద్యా సంవత్సరంలో నెలన్నర తప్ప మిగిలిన రోజుల్లో ఆన్‌లైన్ తరగతులే జరిగాయి. గత ఏడాదికి సంబంధించి మే నెలలో పరీక్షలు జరగాల్సి ఉండగా.. కరోనా రెండో వేవ్ కారణంగా విద్యార్థులను రెండో ఏడాదిలోకి ప్రమోట్ చేశారు. భవిష్యత్తు పరిస్థితులను బట్టి తొలి ఏడాది విద్యార్థులకు పరీక్షలు జరుపుతామని గత ఏప్రిల్‌లో ప్రభుత్వం ప్రకటించింది. దాంతో విద్యార్థులు పరీక్షలు ఉండనట్లేనని భావించి చదువుకు దూరమయ్యారు. పరీక్షలు ఉంటాయన్న స్పష్టత ఇవ్వకుండా విద్యాశాఖ అక్టోబరు 27 నుంచి నిర్వహించింది. అప్పటికే రెండో ఏడాది చదువులో నిమగ్నమైన విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితంగా భారీగా ఉత్తీర్ణత శాతం పడిపోయింది.
తప్పులుంటే 31లోగా ప్రిన్సిపాళ్ల దృష్టికి తీసుకెళ్లాలి
Telangana Intermediate Results 2021 : పునఃలెక్కింపు, పునఃమూల్యాంకనం కోసం ఈనెల 22వ తేదీలోపు ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. తిరిగి లెక్కింపు కోసం సబ్జెక్టుకు రూ.100, పునఃమూల్యాంకనానికి రూ.600 చొప్పున ఫీజు చెల్లించాలి. పునః లెక్కింపు అంటే మార్కుల కూడికలో తేడాలుంటే పరిశీలిస్తారు. పునఃమూల్యాంకనంలో సబ్జెక్టు నిపుణుడితో మరోసారి మూల్యాంకనం చేయిస్తారు. విద్యార్థుల జవాబుపత్రం స్కానింగ్ కాపీని పంపిస్తారు. ఆ పత్రాలను ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్కుల మెమోల్లో తప్పులుంటే విద్యార్థులు వారి చదివే కళాశాలల ప్రిన్సిపాళ్ల దృష్టికి ఈనెల 31వ తేదీలోపు తీసుకువెళ్లాలని బోర్డు తెలిపింది. మార్కుల మెమోలను ఈ నెల 17న సాయంత్రం 5 గంటల నుంచి వెబ్‌సైట్లో ఉంచుతామని పేర్కొంది.
మేడ్చల్‌లో అత్యధికం.. మెదక్‌లో అత్యల్పం
Intermediate First Year Pass Percentage 2021 : ఈసారి మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 63 శాతం ఉత్తీర్ణత దక్కింది. ఆ తర్వాత ములుగు జిల్లాలో 61 శాతం మంది పాసయ్యారు. అత్యల్పంగా మెదక్ జిల్లాలో 22 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు.
సైకాలజిస్టులు మీ కోసమే
Intermediate First Year Results 2021 : ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల నేపథ్యంలో విద్యార్థుల్లో నెలకొన్న ఒత్తిడి, ఆందోళన, భయం తొలగించడానికి ఏడుగురు సైకాలజిస్టులు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ఫోన్లలో అందుబాటులో ఉంటారని ఇంటర్‌బోర్డు తెలిపింది.
పి.జవహర్‌లాల్ నెహ్రు- 91549 51699, రజని- 91549 51695, ఎస్.శ్రీలత- 91549 51703, శైలజా పీసపాటి- 91549 51706, జి.అనుపమ- 91549 51687, మజ్హర్ అలీ- 91549 51977
ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత ఎంత?
TS Intermediate Results 2021 : గత ఏడాది వరకు ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, వివిధ రకాల గురుకుల యాజమాన్యాల వారీగా ఉత్తీర్ణత శాతం ఎంత అన్న గణాంకాలు ఇచ్చే ఇంటర్‌బోర్డు ఈసారి ఇవ్వకపోవడం గమనార్హం. ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత 30 శాతంలోపే ఉందని సమాచారం. అందువల్లనే ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయలేదని పలువురు భావిస్తున్నారు.
సప్లిమెంటరీ పరీక్షలు లేనట్లే!
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో తప్పిన విద్యార్థులకు ఇక సప్లిమెంటరీ పరీక్షలు లేనట్లే. ఈసారి కరోనా కారణంగా ఆర్నెల్లు ఆలస్యంగా పరీక్షలు జరపగా 51 శాతం మంది తప్పారు. వారికి సప్లిమెంటరీ పరీక్షలు జరుపుతామని ఇంటర్‌బోర్డు ప్రకటించలేదు. తప్పిన విద్యార్థులు వచ్చే వార్షిక పరీక్షల సందర్భంగా రాసుకోవాల్సిందే. అప్పుడు ఫస్టియర్‌లో తప్పిన సబ్జెక్టులతో పాటు ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయాలి.
అందరికీ పాస్ మార్కులు ఇవ్వాలి: టీపీఏ
ఇంటర్ ఫస్టియర్‌లో సబ్జెక్టులు తప్పిన విద్యార్థులు ప్రస్తుతం సెకండియర్‌లో ఉన్నందున వారికి కనీస పాస్ మార్కులు ఇవ్వాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం(టీపీఏ) రాష్ట్ర అధ్యక్షుడు నాగటి నారాయణ, ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.