పారిశుద్థ్య, ఎంటమాలజీ విభాగాల్లో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బందిని క్రమబద్ధీకరించి.. వేతన బకాయిలు చెల్లించాలన్న సింగిల్ జడ్జి తీర్పును కొట్టి వేయాలంటూ హైకోర్టుకు జీహెచ్ఎంసీ అప్పీల్ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం జీహెచ్ఎంసీ అప్పీల్పై విచారణ చేపట్టింది.
రాజ్యాంగ విరుద్ధం
పారిశుద్ధ్యం, ఎంటమాలజీ విభాగాల్లో ఉద్యోగాలు మంజూరు కాలేదని, వాటిని కాంట్రాక్టర్లకు అప్పగించినట్లు జీహెచ్ఎంసీ తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. అయితే శాశ్వత ప్రాతిపదికన పనులున్నపుడు తాత్కాలిక ఉద్యోగులతో ఎంత కాలం పని చేయిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. పొరుగు సేవల పేరుతో కనీస వేతనాలు చెల్లించకుండా ఏళ్ల తరబడి కొనసాగిస్తూ సేవలు పొందడం శ్రమదోపిడేనని.. అది రాజ్యాంగానికి, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఇదేం నిజాం రాజ్యం కాదు!
పదేళ్లకోసారి చేపట్టే జనగణన వంటి పనులకు తాత్కాలిక ప్రాతిపదికన ఔట్ సోర్సింగ్ సేవలను చేసుకోవచ్చు కానీ.. శానిటేషన్ వంటి నిరంతర పనులకు శాశ్వత పోస్టులను ఎందుకు సృష్టించరని ప్రశ్నించింది. ఉద్యోగులకు, జీహెచ్ఎంసీకి మధ్య కాంట్రాక్టర్లు ఎందుకన్న ధర్మాసనం.. ఎవరో ఒక అధికారి మధ్యవర్తుల ద్వారా డబ్బు ఖర్చు పెడతానంటే కుదరదని పేర్కొంది. ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం తీసుకుంటున్నప్పుడు చట్టాలను అమలు చేయాల్సిందేనని.. అలా చేయకపోవడానికి ఇదేం నిజాం రాజ్యం కాదని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
పూర్తిస్థాయి వేతనం చెల్లించాలి
సుమారు 30 వేల మంది పొరుగు సేవల ఉద్యోగులకు రెగ్యులర్ జీతాలు చెల్లిస్తే.. కార్పొరేషన్ భరించలేనంత ఆర్థిక భారం పడుతుందని న్యాయవాది నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో ఆర్థిక భారం అని చెప్పుకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్న ధర్మాసనం.. ప్రస్తుతానికి బకాయిలు చెల్లించక పోయినప్పటికీ.. పూర్తి స్థాయి వేతనం మాత్రం చెల్లించాలని సూచించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: డ్రగ్స్: వ్యసనం.. వ్యాపారం.. అరెస్టు