Telangana High Court : కొవిడ్‌పై రెండేళ్ల క్రితం దాఖలైన పిటిషన్లపై నిరంతరం ఆదేశాలు జారీ చేస్తూ వాటిపై విచారణను కొనసాగించలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. వీటికంటే ముఖ్యమైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. కరోనాపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్.నందలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
ఈ పిటిషన్లపై విచారణను మూసివేస్తామని ధర్మాసనం చెప్పగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. కరోనా నాలుగోదశ వచ్చే అవకాశం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. వాదనలను విన్న ధర్మాసనం విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ప్రస్తుతం పాజిటివ్ కేసులు నమోదవుతున్నా తీవ్రత లేదని, నాలుగో దశను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.