వలస కూలీల తరలింపునకు సంబంధించి తాము ఇచ్చిన ఉత్తర్వులు మెడపై కత్తిలా వేలాడుతున్నాయని అనడం సరికాదని రైల్వే శాఖకు హైకోర్టు సూచించింది. వారిని ఆదుకోవడం రాజ్యాంగపరంగా అందరి బాధ్యతని గుర్తుచేసింది. చివరి వలస కూలీ తరలి వెళ్లేవరకు తమ ఉత్తర్వులు కొనసాగుతాయని కోర్టు స్పష్టం చేసింది. వలస కూలీల తరలింపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే.. అనుసరిస్తున్న విధానాన్ని కొనసాగించాలని పేర్కొంది.
వలస కార్మికుల తరలింపునకు ఏర్పాట్లు చేయకపోవడంపై ప్రొఫెసర్ రామశంకర్ నారాయణ్ మేల్కొటె దాఖలు చేసిన ప్రజాప్రయోజనంపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఇటుక బట్టీల కార్మికులకు సంబంధించి మానవ హక్కుల వేదిక సమన్వయకర్త జీవన్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ముగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇటుక బట్టీల కార్మికులు సొంత రాష్ట్రాలకు చేరుకున్నారని, ఈ వ్యాజ్యంపై విచారణను మూసివేయవచ్చని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. సికింద్రాబాద్ వద్ద ఉన్న షెల్టర్ హోంలో కేవలం 20 మంది మాత్రమే ఉన్నారన్నారు.
హైకోర్టు ఉత్తర్వులు తమ మెడపై కత్తి వేలాడుతున్నాయన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అలా పోల్చడం సరికాదని.. అధికరణ 226 కింద వలస కార్మికులకు అండగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందంటూ విచారణను వాయిదా వేసింది.
ఇవీచూడండి: కేసీఆర్ను అభినందిస్తూ వైస్ అడ్మిరల్ లేఖ