రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని.. చివరి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలన్న అంశంపై ఈనెల 24న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.
ఎన్ఎస్యూఐ, మరో రెండు సంస్థలు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. నీట్, జేఈఈ పరీక్షల వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించిందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. పరీక్షలకు సంబంధించిన మరిన్ని వ్యాజ్యాలపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరగనుందని ఏజీ, పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
ఈ అంశాలపై సుప్రీంలో విచారణ పెండింగ్‌లో ఉన్నందున.. ఈనెల 24న తదుపరి వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈనెల 23లోగా కౌంటర్లు దాఖలు చేయాలని యూజీసీ, ఏఐసీటీఈ, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలను న్యాయస్థానం ఆదేశించింది.
ఇవీచూడండి: సుప్రీంకోర్టులో మరోసారి ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు