Telangana High Court On Corona : రాష్ట్రంలో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితి, ప్రభుత్వ చర్యలపై ఉన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. మాస్కులు, భౌతిక దూరం కనిపించడం లేదన్న హైకోర్టు.. వాటిని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణకు డీహెచ్ శ్రీనివాసరావు హాజరు కావాలని ఆదేశించింది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతానికి చేరిందని వైద్యారోగ్య శాఖ హైకోర్టుకు వివరించింది. అయితే రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షలు అమలు చేసే పరిస్థితులు ప్రస్తుతానికి లేవని వివరించింది. ఇంటింటి సర్వేలో మూడు రోజుల్లోనే లక్ష 78 వేల మంది జ్వర బాధితులను గుర్తించి మెడికల్ కిట్లు పంపిణీ చేసినట్లు నివేదించింది.
ఐసీయూ, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 6.1 శాతంగా ఉందని.. ముందు జాగ్రత్తగా జనం గుమిగూడకుండా ఈనెల 31 వరకు ఆంక్షలు విధించినట్టు డీహెచ్ శ్రీనివాసరావు హైకోర్టుకు తెలిపారు. వారం రోజులుగా రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 18 ఏళ్లలోపు వారిలో 59 శాతం మందికి టీకాలు ఇచ్చామని డీహెచ్ వివరించారు. రాష్ట్రంలో 2.16 లక్షల మందికి ప్రికాషన్ డోసు పూర్తైందని స్పష్టం చేశారు.
సర్కార్ తప్పుడు లెక్కలు చెబుతోంది..
Telangana High Court On Corona Rules : : కరోనా పరిస్థితులపై ప్రభుత్వం తప్పుడు గణాంకాలు ఇస్తోందని పిటిషనర్లు వాదించారు. 3 రోజుల్లోనే 1.70 లక్షల జ్వర బాధితులను గుర్తించినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో కరోనా తీవ్రతకు ఇదే నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న కరోనా కిట్లో పిల్లలకు అవసరమైన మందులు లేవని న్యాయస్థానానికి వివరించారు.
తదుపరి విచారణకు డీహెచ్ హాజరుకావాలి..
Telangana High Court On Corona Guidelines : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వం ఎప్పటికప్పు సమీక్ష నిర్వహించి.. చర్యలు తీసుకుంటోందని ఏజీ హైకోర్టుకు తెలిపారు. మాస్కుల ధారణ, భౌతికదూరం పాటించడం అమలు కాకపోవడం దురదృష్టకరమని హైకోర్టు పేర్కొంది. కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ, పోలీసులు.. కరోనా నిబంధనలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని చెప్పింది. పరిస్థితి వివరించేందుకు తదుపరి విచారణకు డీహెచ్ హాజరు కావాలని ఆదేశించింది. కరోనా పరిస్థితిపై విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.
- సంబంధిత కథనం : 'తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ విధించేంత కరోనా తీవ్రత లేదు'
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!