కరోనాపై తెలివైన పదాలతో రాష్ట్ర ప్రభుత్వం మొక్కుబడి నివేదిక సమర్పించిందని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా పరిస్థితులపై ఉన్నత న్యాయస్థానానికి ప్రభుత్వం నివేదిక సమర్పించగా.. సుదీర్ఘ విచారణ జరిగింది. కొవిడ్‌పై వాస్తవాలు వెల్లడించేందుకు ప్రభుత్వం ఇష్టపడటం లేదని.. మరణాలపైనా తప్పుడు గణాంకాలు ఇస్తోందని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
మరణాలపై సందేహం
కేసులు తగ్గినా, పెరిగినా.. మరణాలు మాత్రం పదే ఉంటున్నాయన్న హైకోర్టు.. ఇతర రాష్ట్రాల్లోని కరోనా కేసులు, మరణాలతో పోలుస్తూ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్రంలో రెండోదశ కరోనా వ్యాప్తి పొంచి ఉందని స్పష్టమవుతోందని హైకోర్టు అభిప్రాయపడింది. ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, పడకలు, వెంటిలేటర్లు, మొబైల్ వ్యాన్లు పెంచాలని సూచించింది.
హామీ నిలబెట్టుకోవాలి
గాంధీ, ఛాతీ ఆస్పత్రుల్లో లైవ్ డ్యాష్ బోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీ నిలబెట్టుకోవాలని స్పష్టం చేసింది. కమ్యూనిటీ హాళ్లలో కరోనా పరీక్ష కేంద్రాల ఏర్పాటును పరిశీలించాలని సూచించింది. ప్రజారోగ్య సిబ్బందిని ఇతర పథకాల అమలుకు మళ్లించవద్దని స్పష్టం చేసింది. కరోనా పరిస్థితుల్లో గృహహింసపై ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలన్న హైకోర్టు.. నవంబరు 16లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబరు 19కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి : కరోనా నిబంధనలతో.. శాసనసభ, మండలి సమావేశాలు