Telangana High Court On Kaloji University Appeal : మెడికల్ పీజీ ఫైనల్ పరీక్షల్లో ఫెయిలైన వారందరి జవాబు పత్రాలను నిబంధనల ప్రకారం మూల్యాంకనం నిర్వహించాకే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని బుధవారం హైకోర్టు స్పష్టం చేసింది. ఎలాంటి గుర్తులు లేకుండా నిర్వహించిన డిజిటల్ వాల్యుయేషన్‌ను రద్దు చేసి రీవాల్యుయేషన్ చేసిన అనంతరమే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కాళోజీ యూనివర్సిటీ దాఖలు చేసిన అప్పీలును కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది.
Kaloji University Appeal in High Court : నలుగురు ప్రొఫెసర్లు డిజిటల్ మూల్యాంకనం నిర్వహిస్తారని, ఒకరు మార్కులు వేసినట్లయితే మిగిలినవారు ప్రభావితులవుతారన్న యూనివర్సిటీ వాదనలను తోసిపుచ్చింది. డిజిటల్ మూల్యాంకనం నిమిత్తం వేర్వేరుగా జవాబు పత్రాలను అందజేస్తారని, అలాంటప్పుడు ఒకరిపై మరొకరి ప్రభావం ఉంటుందనడం సరికాదంది. కోర్టుకు వచ్చిన 11 మంది పరీక్ష పత్రాలను మాత్రమే రీవాల్యుయేషన్ చేసి, మిగిలినవారికి సప్లిమెంటరీ పరీక్షలు పెట్టాలంటూ కొందరు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌లను కొట్టేసింది. రీవాల్యుయేషన్ అందరికీ ఒకేలా జరగాల్సి ఉందని తేల్చి చెప్పింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!