Telangana High Court News : కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు చెందిన జీవో నం.16, దానికి అనుగుణంగా జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను గురువారం హైకోర్టు కొట్టివేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం 2016లో జారీ చేసిన జీవో నం.16, ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ స్టేట్ డాక్టరేట్స్ అసోసియేషన్‌తోపాటు మరొకరు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిల ధర్మాసనం విచారణ చేపట్టింది.
Contract Employees Regularization : అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ జోక్యం చేసుకుంటూ.. ఇదే జీవోపై గతంలో దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసిందన్నారు. ప్రభుత్వ నిర్ణయం కర్ణాటక వర్సెస్ ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పబోగా జోక్యం చేసుకున్న ధర్మాసనం.. ఇప్పటికే ఈ అంశంపై కోర్టు ఉత్తర్వులు విడుదల చేసినందున మళ్లీ విచారణ చేపట్టలేమని తేల్చి చెప్పింది. కావాలంటే పునఃసమీక్ష కోరుతూ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని, లేనిపక్షంలో సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.