రాష్ట్ర రాజధాని పరిధిలో గణేష్ నిమజ్జనం(lord Ganesh visarjan) ఎక్కడ చేయాలన్న దానిపై మళ్లీ అయోమయం నెలకొంది. ఈ ఒక్క ఏడాదికి హుస్సేన్‌సాగర్‌లో చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) సోమవారం హైకోర్టును మరోసారి అభ్యర్థించినా తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 19న నగర వ్యాప్తంగా విగ్రహాలను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన కోనేరుల్లోనే నిమజ్జనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఏర్పాటు చేసిన అన్ని ప్రతిమలను కోనేరుల్లో క్రేన్ల ద్వారా ముంచి తీసినా కనీసం ఆరు రోజులు సమయం పడుతుందని అధికారులు సర్కార్ దృష్టికి తెచ్చారు. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసే యోచనలో సర్కార్ ఉందని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. దీనిపై మంగళవారం తుది నిర్ణయం తీసుకుంటారని బల్దియా ఉన్నతాధికారితెలిపారు. ఇదే సమయంలో ప్రత్యామ్నాయంగా కొలనుల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు మాత్రం ఎప్పటిలాగే సాగర్, చెరువుల్లోనే నిమజ్జనం(lord Ganesh visarjan) చేస్తామని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అయిదు అడుగులు దాటినవే 35వేలు..
గత కొన్నేళ్లగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని విగ్రహాలన్నింటిని హుస్సేన్‌సాగర్‌తోపాటు సమీపంలోని పెద్ద చెరువుల్లో నిమజ్జనం చేస్తున్నారు. ఈ ఏడాది కూడా ఇదే విధంగా చేపట్టడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ కోర్టు తీర్పుతో అధికారుల్లో అలజడి మొదలైంది. మహాగనగరంలో పరిధిలో పోలీసుల దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్న అయిదు అడుగుల ఎత్తుకు మించిన ప్రతిమలు దాదాపు 35 వేల వరకు ఉన్నాయి. అయిదు అడుగుల లోపు వాటిని కూడా లెక్క తీసుకుంటే అధికారికంగా, అనధికారికంగా లక్షన్నర ఉంటాయని అంచనా. చిన్న విగ్రహాల కోసం మహానగరంలో 200 కోనేరులను నిర్మించాలని మూడేళ్ల కిందటే అధికారులు తెలపెట్టారు. కానీ మూడేళ్లలో నిర్మించినవి కేవలం 28 మాత్రమే. ఇందులో 25 అధికారులు సిద్ధం చేశారు. వీటిలో నిమజ్జనానికి ఓ ప్రధాన సమస్య ఎదురవుతోంది. వీటికి పూర్తిస్థాయి రహదారి సౌకర్యం లేదు. భారీ వర్షాల నేపథ్యంలో ఆ మార్గాల్లో విగ్రహాలను తీసుకువెళ్లే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. కొలనుల్లో 10 నుంచి 40 అడుగుల వరకు విగ్రహాలను నిమజ్జనం చేయడం సాధ్యం కాదని అధికారులే అంటున్నారు.
సిద్ధమవుతున్న భాగ్యనగర ఉత్సవ సమితి
మరోవైపు భాగ్యనగర ఉత్సవ సమితి నిమజ్జనాన్ని గతంలో జరిగినట్లే చేపట్టడానికి సిద్ధమవుతోంది. ‘హైకోర్టు సాగర్, చెరువుల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. మేము నిమజ్జనం(lord Ganesh visarjan) చేసే విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలని ఎవరు ధ్రువీకరిస్తారు’ అని భాగ్యనగర ఉత్సవ సమితి ప్రశ్నిస్తోంది. పోలీసులు నిరోధిస్తే తప్ప ఉత్సవ విగ్రహాలు సాగర్, చెరువుల దగ్గరకే తీసుకువెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు తీసుకునే చర్యలు మీదే నిమజ్జనం ఎలా జరుగుతుందని తేలుతుందని చెబుతున్నారు.