Ration Rice in Telangana : రాష్ట్రంలోని రేషన్‌కార్డుదారులకు అదనపు కోటా బియ్యం పంపిణీపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుత నెలలో మాదిరిగానే ఇకపై బియ్యం పంపిణీ చేయాలన్న యోచనలో రాష్ట్రప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కరోనా కారణంగా పేదలను ఆదుకునేందుకు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పేరుతో కార్డులో నమోదైన ప్రతి వ్యక్తికీ అయిదు కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్న విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం రూపాయికి కిలో చొప్పున ఆరు కిలోల బియ్యం ఇస్తోంది. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి రెండూ కలిపి ప్రతి వ్యక్తికి 11 కిలోల చొప్పున ఉచితంగానే బియ్యం పంపిణీ చేశారు. కేంద్రం ఉచిత బియ్యం పంపిణీని ఏప్రిల్ నుంచి ఆరునెలల పాటు కొనసాగించాలని నిర్ణయించి రాష్ట్రాలకు ఉత్తర్వులిచ్చింది. కరోనా వ్యాప్తి తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో గతంలో మాదిరిగానే ఒక్కో వ్యక్తికి ఆరుకిలోల బియ్యాన్నే పంపిణీచేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించి ఆ మేరకే మే నెల కోటాను విడుదల చేసింది.
అదనపు కోటా బియ్యం అనుమానమే? : రాష్ట్రంలో 90.42 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. సుమారు రెండున్నర కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 53.71 లక్షల మందే రేషన్‌కార్డులకు అర్హులు. మొత్తం కార్డుదారులకు నెలకు 1.81లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఇందులో కేంద్రం నెలకు 1.08 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తుండగా మిగిలిన 73వేల మెట్రిక్ టన్నులను రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల నుంచి కొంటోంది.
కొవిడ్ కారణంగా కేంద్రం ఇచ్చిన అదనపు కోటా సహా 2020 ఏప్రిల్ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కోటాలను కలుపుకొని నెలకు 3.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇచ్చిన 36.71 లక్షల కార్డులకు, కేంద్ర నిబంధనల మేరకు అర్హత పొందిన 53.71 లక్షల కార్డులకు కిలో బియ్యం అదనంగా ఇవ్వాల్సి రావటంతో నెలకు రూ.72 కోట్ల వరకు అదనపు భారం పడుతోందని అధికారులు లెక్కలు కట్టారు. ఇస్తున్న బియ్యంలో అధిక భాగం పక్కదారి పడుతోందన్న సమాచారంతో అదనపు కోటా ఇవ్వడంపై ప్రభుత్వం సుముఖంగా లేదని తెలుస్తోంది.