మాంద్యం నుంచి కొలుకోక ముందే కొవిడ్ వైరస్ కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులు ఆర్థికరంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాలు బాగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ ఖజానాకు రాబడులు పూర్తిస్థాయిలో పడిపోయాయి. సడలింపులు ఇచ్చినప్పటికీ ఆర్థిక కార్యాకలాపాలు ఇంకా ఊపందుకోలేదు. ఫలితంగా సర్కార్ ఖజానాకు నిధులు వస్తున్నా అంచనాలకు చాలా దూరంలో ఉంది. ఇదే సమయంలో లాక్‌డౌన్ వల్ల చాలా మంది ఉపాధి కూడా కోల్పోయారు. ఉపాధి కోసం ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారంతా తిరిగి సొంతూళ్లకు చేరుకున్నారు. వారందరికీ కూడా ఉపాధి చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
వీలైనంత సద్వినియోగం..
ఈ పరిస్థితుల్లో జాతీయ ఉపాధిహామీ పథకాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. లాక్‌డౌన్ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ పనులవైపు జనం బాగా మొగ్గు చూపారు. కొత్తగా పలువురికి జాబ్ కార్డులు అందించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా ఇతరత్రా నిధులు కూడా తగ్గాయి. ఐతే ఉపాధిహామీ పథకానికి సంబంధించి మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవు. ఉపాధిహామీ పథకాన్ని వీలైనంత సద్వినియోగం చేసుకోవడం ద్వారా పనులు పూర్తి చేయడంతో పాటు ఉపాధి కూడా కల్పించినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
సర్కార్ కసరత్తు..
ఈ దిశగా సర్కార్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. మంత్రులు, అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏయే శాఖలో ఏ పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందో గుర్తించాలని ఆదేశించారు. ఉపాధిహామీ నిధులను వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అన్ని శాఖల కార్యదర్శులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్య పనులైన వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, కల్లాలు, గ్రామీణ పార్కులు, గొర్రె-పశువుల షెడ్ల నిర్మాణాల పనులతో పాటు నీటిపారుదలశాఖలో ఫీడర్ చానళ్లు, డిస్ట్రిబ్యూటరీల డీసెల్టింగ్, హౌసింగ్ కాలనీలలో మౌలికవసతుల పనులు తదితరాలను చేపట్టడంపై దృష్టి సారించాలని సూచించారు. వివిధ పనులకు సంబంధించి నిర్ణీత నమూనాలు, అంచనాలు రూపొందించాలని... గ్రామ, మండల, జిల్లాల వారీగా ప్రణాళికలు తయారు చేయాలని చెప్పారు.
సీజనల్ కేలండర్..
రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను రోడ్లపై ఆరబోసుకునే పరిస్థితి రాకుండా ఉపాధిహామీ నిధులతో ఒక్కొక్కటి 45 వేల రూపాయల అంచనా వ్యయంతో లక్ష కల్లాలను నిర్మించాలని మంత్రులు ప్రతిపాదించారు. అన్ని శాఖల్లో చేపట్టాల్సిన పనులను గుర్తించి సీజనల్ కేలండర్ తయారు చేసి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఇతర అంశాలతో పాటు నియంత్రిత విధానంలో పంటల సాగు, ఉపాధిహామీ నిధులతో పనులు చేపట్టే అంశంపై ప్రధానంగా సీఎం దృష్టిసారించనున్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలోని పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది: కేటీఆర్