దేశంలో కనీవినీ ఎరుగని వినూత్న పథకాలను, ప్రజోపయోగ కార్యక్రమాలతో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్‌లో గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకం ఆవిష్కరించారు. గణతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆర్, మంత్రులు పాల్గొన్నారు. సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్... అనంతరం రాష్ట్ర అభివృద్ధిని ఆవిష్కరించారు.
గడిచిన ఆరున్నరేళ్లలో పద్ధతి ప్రకారం జరిగిన కృషి ఫలితంగా ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుందన్నారు. 2020 ఏడాదంతా కరోనా వైరస్ సృష్టించిన కల్లోలంలో కష్టంగా గడిచిపోయిందన్న తమిళిసై.... కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కావడంతో 2021 సంవత్సరాన్ని ఆశావహ దృక్పథంతో ప్రారంభించుకున్నట్లు వివరించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విధానాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయని గవర్నర్ తెలిపారు. నిరంతర విద్యుత్ ద్వారా 24 లక్షల పంపుసెట్ల కింద పంటలు సమృద్ధిగా పండుతున్నాయని చెప్పారు. కోటిన్నర ఎకరాల్లో బంగారు పంటలు పండిస్తున్న తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారిందని అన్నారు. దేశంలో 55 శాతం ధాన్యం తెలంగాణ నుంచే సేకరించారని పేర్కొన్నారు. 50 శాతం రాయితీపై ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు రైతులకు అందజేస్తున్నామని తమిళిసై స్పష్టం చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం నిలిచింది. శరవేగంగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు, సీతారామ, దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాలు 4 మీటర్ల మేర పెరిగాయి. పాలనా సామర్థ్యానికి గీటురాయిగా విద్యుత్ విజయాలు సాధించాం. అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్నాం.
- రాష్ట్ర గవర్నర్ తమిళిసై