గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. అత్యధికంగా ఈ రంగాలపైనే నిధులు ఖర్చుచేసింది. 2014-15వ ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు పూర్తిచేసిన, ప్రస్తుతం అమలులో ఉన్న పనులను పరిగణనలోకి తీసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ, మెట్రో వాటర్ వర్క్స్, మెట్రోరైలు, రోడ్లు,భవనాలు, చెరువులు, సరస్సుల వంటి నీటివనరుల అభివృద్ధి..ఇలా అన్ని విభాగాల్లో కలిపి రూ.67,149.23 కోట్లు వెచ్చించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ పరిధిలో చేసిన ఖర్చుపై ఈ మేరకు ప్రభుత్వం ఓ నివేదిక రూపొందించింది. దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల జాబితాలో హైదరాబాద్ ఉన్నందున, ఇక్కడ మౌలిక సదుపాయాలను పరిరక్షించడంతోపాటు, కొత్త వసతుల కల్పనకు అనేక పనులు చేపట్టినట్లు ఈ నివేదికలో వెల్లడించింది. సదరు నివేదికను శుక్రవారం పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.
నిర్మాణంలో 98 వేల రెండు పడక గదుల ఇళ్లు
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం 109 చోట్ల ప్రారంభమైంది. 98 వేల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటికోసం ఇప్పటికే రూ.6,113.88 కోట్లు ఖర్చుచేశాం. మరో రూ.3,586.12 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. మొత్తంగా గృహ నిర్మాణానికే రూ.9,700 కోట్లు వెచ్చించాం.
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఐదేళ్లలో రూ.67,149 కోట్ల వ్యయం
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్ మహానగర ప్రగతికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా రవాణా సౌకర్యాల్లో కీలకమైన రహదారుల అభివృద్ధి, ఫ్లైఓవర్లు, లింకురోడ్ల నిర్మాణం, కూడళ్ల సుందరీకరణకు ఐదేళ్ల వ్యవధిలో అధిక నిధులు వెచ్చించినట్టు వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో స్వచ్ఛత పెంపుదల సహా మొక్కల పెంపకం, ఉద్యానవనాల అభివృద్ధి, పర్యాటక రంగం, వారసత్వ భవనాల పరిరక్షణకు ఎనలేని కృషిచేసినట్టు తెలిపింది. పోలీసు వ్యవస్థను మెరుగుపరడం వల్ల ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు రక్షణ పెరిగిందని, ఇది మహానగర బ్రాండ్ విలువ పెంచిందని చెప్పింది. ఫలితంగా ఐదేళ్లలో రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టగలిగామని శుక్రవారం హైదరాబాద్ ప్రగతిపై విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మొత్తంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ విభాగాల్లో ఖర్చయిన నిధులు, తద్వారా ఒనగూరిన ప్రయోజనాలను ఈ నివేదికలో పొందుపరిచింది.
నివేదికలోని ముఖ్యాంశాలివీ
* వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక కింద రూ.24 వేల కోట్ల పెట్టుబడితో 137 కి.మీ పొడవున ఏడు ఆకాశ మార్గాలు, 166 కి.మీ పొడవున కారిడార్ల నిర్మాణం చేపట్టాం. ఇందులో అనేక పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీనివల్ల అత్యంత రద్దీగా ఉండే కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, అయ్యప్ప సొసైటీ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గింది. ఇందిరా పార్క్, ఒవైసీ జంక్షన్ తదితర ప్రాంతాల్లో ఉక్కు వంతెనల నిర్మాణం ప్రారంభ దశలో ఉంది.
* ఎస్‌ఆర్‌డీపీ కింద 46 ప్లైఓవర్ల నిర్మాణం చేపట్టడంతోపాటు 27 లింకు రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాం. సమగ్ర రోడ్డు మరమ్మతు పథకం(సీఆర్‌ఎంపీ) కింద 709 కి.మీ రోడ్ల నిర్మాణాన్ని ఏడు ప్యాకేజీలుగా చేపట్టి, వాటి పూర్తికి లాక్‌డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాం. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక కింద ఫ్లైఓవర్లు, ఆర్‌ఓబీలు, కూడళ్ల సుందరీకరణ ఇలా అన్నింటికీ కలిపి చేసిన ఖర్చు, నిర్మాణంలో ఉన్న పనుల విలువ రూ.8,410 కోట్లు.
* నగరంలో వెయ్యి బస్ షెల్టర్ల నిర్మాణం పూర్తయింది. మరో 800 నిర్మాణంలో ఉన్నాయి.
* క్రీడాసదుపాయాలు, ఆడిటోరియం, ఇండోర్ స్టేడియాలు, ఆట స్థలాల నిర్మాణానికి మరో రూ.97.37 కోట్లు ఖర్చు చేశాం.* పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాం. ఘన వ్యర్థాల సేకరణకు ప్రభుత్వం వాహనాలు సమకూర్చడంతోపాటు స్వచ్ఛత కోసమే రూ.1,716.33 కోట్లు ఖర్చుచేశాం. నగరంలో సంక్షేమ కార్యక్రమాలకూ అధిక ప్రాధాన్యం ఇచ్చాం.
2 లక్షల కోట్ల పెట్టుబడులు..15 లక్షల ఉద్యోగాలు!
హైదరాబాద్ బ్రాండ్ విలువ పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఐటీ రంగం అభివృద్ధితోపాటు పెట్టుబడులు ఆకర్షించేందుకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టడం ద్వారా 15 లక్షల ఉద్యోగాలకు అవకాశం వచ్చిందని నివేదికలో వెల్లడించింది. ఐటీ రంగం పురోభివృద్ధి జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని, 1100కుపైగా అంకుర సంస్థలు వచ్చాయని తెలిపింది.
* హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టును నివేదికలో ప్రత్యేకంగా పేర్కొంది. మూడు కారిడార్లు పూర్తిచేయడం వల్ల నగర వాసుల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిందని, ఇందుకోసం రూ.17 వేల కోట్లకు పైగా ఖర్చుచేశామంది.
* శాంతిభద్రలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. హైదరాబాద్ పోలీసు వ్యవస్థ ఆధునికీకరణ, సైబర్ నేరాలు అరికట్టే చర్యలు, రక్షణకుగానూ అధిక సంఖ్యలో సీసీ కెమెరాలు అమర్చాం. మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు, పోలీసులకు ఆధునిక వాహనాలు అందజేయడం సహా మెరుగైన పోలీసు వ్యవస్థను తయారుచేయగలిగాం.
* హైదరాబాద్‌ను సుందరీకరించేందుకు, ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకున్నట్టు వివరించింది.
* పారిశ్రామిక అభివృద్ధికి విశేష ప్రాధాన్యం ఇచ్చి పటాన్‌చెరువు, జీడిమెట్ల, సైబరాబాద్, శంషాబాద్ జోన్లలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు రూ.2,115 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించింది.
ఉద్యానవనాల అభివృద్ధికి రూ.250 కోట్లు
జీహెచ్‌ఎంసీ పరిధిలో జీవ వైవిధ్య విభాగం 17 పెద్ద ఉద్యానవనాలు, 17 థీం, 860 కాలనీ పార్కులతోపాటు మరో 331 పార్కులను నిర్వహిస్తోంది. హరితహారం పథకంలో భాగంగా వీటి పరిధితోపాటు ఖాళీ స్థలాలు, సంస్థలు, రోడ్లకిరువైపులా, చెరువులు, సరస్సుల పక్కన, మైదానాల్లో మొక్కలు నాటేందుకు ఆ విభాగం రూ.250 కోట్లు ఖర్చుచేసింది.
తాగునీటి సరఫరాకు ప్రాధాన్యం
తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థల మెరుగుదల, నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు నివేదికలో ప్రభుత్వం వెల్లడించింది. మెట్రో వాటర్ వర్క్స్ పరిధిలో గోదావరి తాగునీటి సరఫరా మొదటి దశ, కృష్ణా మూడోదశ, ఘన్పూర్ నుంచి పఠాన్‌చెరువు వరకు నీటి సరఫరా మెయిన్ లైన్, పాతబస్తీలో నీటి సరఫరా వ్యవస్థ బలోపేతానికి ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు తదితరాలను ఉదహరించింది. సరస్సులు, జలాశయాల పునరుద్ధరణకు పెద్దపీట వేసి, హుస్సేన్‌సాగర్ అభివృద్ధికే రూ.289 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొంది.
* హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు కూడా తెలిపింది. మొత్తంగా తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థల బలోపేతానికి 2014 నుంచి 2020 ఆగస్టు వరకు రూ. 8,382 కోట్లు వెచ్చించినట్టు తెలిపింది.