దళిత బంధు పథకం అమలుకు ముందే రాష్ట్రవ్యాప్తంగా అన్ని దళిత వాడలు, గిరిజన ఆవాసాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే దళిత వాడల్లో మౌలిక వసతులు సరిగ్గా లేవని హజూరాబాద్ దళిత ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు... ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో వివిధ శాఖల ఇంజినీర్ల బృందాలు విస్తృతంగా పర్యటించి సర్వే చేసి చేపట్టాల్సిన పనులను గుర్తించారు. ఆ సర్వే ఆధారంగా నియోజకవర్గంలోని దళితవాడల్లో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
హుజూరాబాద్ నమూనా..
హుజూరాబాద్ తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితవాడలు, గిరిజన ఆవాసాల్లోనూ మౌలిక వసతుల సమస్య లేకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సీసీ రహదారులు, డ్రైనేజీలు, వీధిదీపాలు, విద్యుత్ సమస్యలు, మిషన్ భగీరథ అంతర్గత పనులు.. తదితర ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
పదిరోజుల గడువు..
ఆ దిశగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని దళిత వాడలు, గిరిజన ఆవాసాల్లో ఉన్న మౌలిక సదుపాయాల ఇక్కట్లపై అంచనాలు రూపొందించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. హుజూరాబాద్ తరహాలోనే విస్తృత కసరత్తు చేసి పది రోజుల్లోగా చేపట్టాల్సిన పనులకు సంబంధించిన అంచనాలు రూపొందించాలని స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్లందరూ తక్షణమే ఆ దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు.
ఉపాధి హామీ, పల్లె, పట్టణ ప్రగతి, జిల్లా, మండల పరిషత్, ఎంపీలు, ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులతో పాటు మిషన్ భగీరథ, డిస్కంలు, సీఆర్ఆర్, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధుల నుంచి ఈ పనులను చేపట్టాలని ప్రభుత్వం తెలిపింది. గ్రామీణాభివృద్ధి కమిషనర్, పురపాలక శాఖ సంచాలకులు, మిషన్ భగీరథ ఈఎన్సీ, ట్రాన్స్ కో జేఎండీలు వారి పరిధిలో కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని... కలెక్టర్లతో సమన్వయం చేసుకొని పది రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎస్ ఆదేశించారు.
ఇవీచూడండి: MLC JeevanReddy: '30 లక్షల విలువైన భూమిస్తానని చెప్పి.. 10 లక్షలతో సరిపెట్టుకుంటున్నారు'