భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించడం సహా భవిష్యత్లో ఎలాంటి సమస్యలకు ఆస్కారం లేకుండా.. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సర్వేకు సిద్ధమైంది. రాష్ట్రంలోని వ్యవసాయ భూముల సమగ్ర సర్వే చేపడతామన్న సర్కార్.. బడ్జెట్‌లో ఇందుకోసం రూ.400 కోట్లను కేటాయించింది. పూర్తిగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉపగ్రహ ఛాయాచిత్రాలు.. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ విధానం సహాయంతో.. ఈ సర్వే ప్రక్రియ చేపట్టనున్నారు.
లైడార్ స్కానింగ్..
హెచ్ఎండీఏ మినహా రాష్ట్రమంతటా డిజిటల్ రీ సర్వే చేయనున్నారు. మొత్తం విస్తీర్ణం లక్షా 12 వేల 77 చదరపు కిలోమీటర్లు కాగా.. అందులో అటవీ ప్రాంతం 26 వేల 904 చదరపు కిలోమీటర్లు. అటవీ ప్రాంతాన్ని మినహాయిస్తే మిగిలే ప్రాంత విస్తీర్ణం 85 వేలా 173 చదరపు కిలోమీటర్లు. హెచ్ఎండీఏ ప్రాంత విస్తీర్ణం 7 వేల 257 చదరపు కిలోమీటర్లుగా ఉంది. హెచ్ఎండీఏ మినహా మిగతా ప్రాంతాన్ని రీసర్వే చేస్తున్న నేపథ్యంలో.. మిగిలిన 77 వేల 916 చదరపు కిలోమీటర్లు అంటే దాదాపు 80 వేల చదరపు కిలోమీటర్ల మేర భూముల సమగ్ర సర్వే చేపడతారు. అటవీ సరిహద్దు ప్రాంతాన్ని... లైడార్ స్కానింగ్ కూడా చేస్తారు. అత్యంత ఎక్కువ రెజల్యూషన్ కలిగిన ఉపగ్రహ ఛాయాచిత్రాల సహాయంతో.. సర్వే ప్రక్రియ నిర్వహిస్తారు.
ఉపగ్రహ ఛాయా చిత్రాల నుంచి..
గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ విధానం ద్వారా నిరంతర ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ల నెట్వర్క్తో కచ్చితమైన భూ నియంత్రణ పాయింట్లు నిర్ధారిస్తారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ కేంద్రం నుంచి అవసరమైన ప్రాంతాల స్టిరియో చిత్రాల జంటను సేకరిస్తారు. ఉపగ్రహ ఛాయా చిత్రాల నుంచి రూపొందించిన ఆర్థో ఫోటో నిర్ధేశంతో.. ట్యాబులు, స్మార్ట్ ఫోన్లు ఉపయోగించి కమతాల సరిహద్దులను నిక్షిప్తం చేస్తారు. ఆర్ఓఆర్లోని సమాచారం, భూ కమతం వివరాలనూ తీసుకుంటారు. ఆర్ఓఆర్లోని సమాచారాన్ని పొందుపరిచి ఆయా భూభాగాలకు అనుసంధానిస్తారు.
ఏకీకృత భూ సమాచార వ్యవస్థను అభివృద్ధి చేసి ముసాయిదా రికార్డులను.. రెవెన్యూ, సర్వే, సెటిల్మెంట్, భూరికార్డుల శాఖల సమక్షంలో ఉంచి పరిశీలిస్తారు. రికార్డులు సంబంధిత శాఖల ఆమోదం పొందాక.. భూ యజమానులకు చట్టపరమైన నోటీసులు జారీ చేస్తారు. వాటిపై అభ్యంతరాలు, విజ్ఞప్తులను స్వీకరించి.. వాటిని పరిష్కరించిన అనంతరం తుది రికార్డులను రూపొందిస్తారు.