గోదావరి బేసిన్‌లో ఎక్కువ నీటిని వినియోగించుకోవడానికి తెలంగాణ కొత్త ప్రాజెక్టులు, చెక్‌డ్యాంలను నిర్మిస్తుందని ఆంధ్రప్రదేశ్ చేసిన ఆరోపణ అర్థరహితమని తెలంగాణ నీటిపారుదల శాఖ పేర్కొంది. గోదావరి బేసిన్‌లో తెలంగాణ అధిక సంఖ్యలో చెక్‌డ్యాంల నిర్మాణాన్ని చేపట్టిందని, దీనివల్ల వర్షాలు లేని సమయంలో వచ్చే నామమాత్రపు ప్రవాహం దిగువకు రాకుండా పోతుందని, చెక్‌డ్యాంలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ గోదావరి నదీ యాజమాన్యబోర్డుకు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ లేఖ రాసింది. ఇందులో కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల, తుపాకులగూడెం, దేవాదుల ఎత్తిపోతల నుంచి ఎక్కువ నీటిని మళ్లించేలా పనులు చేపడుతుందని, తాగునీటి పథకానికి నీటిని మళ్లిస్తుందని పేర్కొంది. ఈ లేఖను గోదావరి బోర్డు తెలంగాణ నీటిపారుదల శాఖకు పంపి వివరణ కోరింది. దీనిపై నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ ఇటీవల రాసిన లేఖను బోర్డు ఆంధ్రప్రదేశ్‌కు పంపింది. తెలంగాణ రాసిన లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి.
- గోదావరిలో ఉన్న నీటి లభ్యతలో 776 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కు, 650 టీఎంసీలు తెలంగాణకు ఉన్నాయని పేర్కొనడం సరైంది కాదు. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం గోదావరిలో 1,486.15 టీఎంసీల లభ్యత ఉండగా, ఇందులో 957.94 టీఎంసీలు తెలంగాణకు, 518.25 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నాయి. ఇది కూడా ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నదానికంటే ఎక్కువ చేసి చూపించారు. పోలవరం, ధవళేశ్వరానికి కలిపి 449.77 టీఎంసీలు ఉంది. చిన్ననీటి వనరుల కింద 31.15 టీఎంసీలు, సీలేరు జల విద్యుత్తు కేంద్రం ఆవిరికి 8.67 టీఎంసీలు, పోలవరంలో ఆవిరికి 34.92 టీఎంసీలుగా పేర్కొన్నారు. వాస్తవానికి పోలవరంలో ఆవిరయ్యే నీరు 23 టీఎంసీలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌కు 776 టీఎంసీలు అనేదే లేదు. లేకపోయినా తప్పు క్లెయిమ్ చేస్తుంది. మొత్తమ్మీద 258 టీఎంసీలు ఎక్కువ చేసి చూపిస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతలను 225 టీఎంసీల నుంచి 400 టీఎంసీలకు, సీతారామ ఎత్తిపోతలను 70 టీఎంసీల నుంచి 100 టీఎంసీలకు పెంచుతున్నారని అవాస్తవాలు చెప్పారు.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూపొందించినవి తప్ప కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదని గోదావరి నదీ యాజమాన్య బోర్డు తొమ్మిదో సమావేశంలోనూ, రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ స్పష్టంగా చెప్పినా మళ్లీ పదేపదే అవే అంశాలను లేవనెత్తుతూ తప్పుదోవ పట్టించేలా ఏపీ వ్యవహరిస్తుంది.
- కంతనపల్లి ప్రాజెక్టును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపడితే బ్యారేజి నిర్మాణ స్థలాన్ని మాత్రమే తుపాకులగూడెం వద్దకు మార్చాం.రామప్పలేక్, పాకాల లేక్‌ను 2013లోనే దేవాదులలో భాగంగా చేపట్టాం. అయినా కొత్త ప్రాజెక్టులని రాస్తూనే ఉండటం అర్థరహితమని మురళీధర్ రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను మళ్లీ గోదావరి బోర్డు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖకు పంపింది.