monkeypox : మశూచిని పోలిఉండే వైరల్ వ్యాధి మంకీపాక్స్‌పై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. 80 దేశాల్లో ఈ కేసులు నమోదవుతుండడం, వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి రాకపోకలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అన్ని జిల్లాల వైద్యాధికారులకు పలు సూచనలు చేసింది. ప్రస్తుతం ఈ కేసులు మన వద్ద నమోదు కాకపోయినా, ముందు జాగ్రత్తల ద్వారా వైరస్ వ్యాప్తిని నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
Monkeypox Cases in Telangana : ఈ కేసులు నమోదైన దేశాలకు గత మూడు వారాల్లో వెళ్లివచ్చిన వారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే.. వారి రక్తం, లాలాజలం నమూనాలు సేకరించాలని స్పష్టం చేసింది. వాటిని పుణెలోని జాతీయ వైరాలజీ ల్యాబ్‌కు పంపి పరీక్షస్తారు. సంబంధితులను ఐసోలేషన్ చేయడంతో పాటు వారు ఎవరెవర్ని కలిశారో వివరాలు సేకరించాలని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. కరోనా కేసుల్లో లానే కాంటాక్టులను గుర్తించి వారూ 21 రోజులపాటు ఐసొలేషన్‌లో ఉండేలా చూడాలంది.
ఈ లక్షణాలు కనిపిస్తే.. ప్రారంభంలో జ్వరం, తలనొప్పి, శరీరంపై వాపు.. వెన్ను, కండరాల్లో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత జ్వరం పెరిగి శరీరమంతా దద్దుర్లు వస్తాయి. అవి చిట్లి పుండ్లవుతాయి. అతికొద్ది మందిలోనే ఇది విషమంగా మారుతుంది. నోరు, ముక్కు, చర్మం నుంచి ఈ వైరస్ శరీరంలోకి చేరుతుంది. 7-14 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి సోకిన వ్యక్తికి దగ్గరగా ఉండటం, వారి దుస్తులు వాడటం, ఆ వ్యక్తి శరీర స్రావాల ద్వారా ఇతరులకు సోకుతుంది. చేతిశుభ్రత పాటించడం, మాస్క్, ఫేస్‌షీల్డ్ వంటివి ధరించాలి.
అప్రమత్తంగా ఉన్నాం : "మంకీపాక్స్‌తో భయం అవసరం లేదు. ఆ కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చినవారు కొన్ని రోజులు ఇంటికే పరిమితం కావాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వానికి సమాచారం అందించి చికిత్స పొందాలి." -డా.రాజారావు,సూపరింటెండెంట్, గాంధీ ఆసుపత్రి
- ఇదీ చదవండి : ఒడిశాలో 'టమాట ఫ్లూ' కలకలం.. 26 మందికి పాజిటివ్