రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలను జులై 1 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. పాఠశాలలపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. కేబినెట్ నిర్ణయం తర్వాత విధివిధానాలు ఖరారు చేసేందుకు వేగంగా ముందుకు కదిలిన విద్యాశాఖ.. ఇటీవల సుప్రీంకోర్టు, హైకోర్టు వ్యాఖ్యలతో సందిగ్ధంలో ఉన్నట్లు సమాచారం. ఈనెల 21న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి.. ప్రతిపాదనలు సిద్ధంచేయాలని చెప్పారు. ముందుగా ఎనిమిదో తరగతి నుంచి 10 తరగతి వరకు ప్రారంభించి.... ఆ తర్వాత దశలవారీగా దిగువ తరగతులకు బోధన మొదలుపెట్టాలనే ప్రతిపాదనలపై చర్చించారు. గురుకులాలకు సంబంధించి వివిధ సంక్షేమ శాఖల మంత్రులతోపాటు... విద్యా సంస్థల యాజమాన్యాలతో.. త్వరలో సమావేశం నిర్వహిస్తామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు విధివిధానాలపై స్పష్టత రాలేదు. కనీసం వాటికి సంబంధించిన సమావేశాలు కూడా జరగలేదు.
హైకోర్టు ప్రశ్నల వర్షం..
పాఠశాలల ప్రారంభంపై ఈనెల 23న హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. విద్యార్థులకు కరోనా సోకదని హామీ ఇవ్వగలరా.. ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేయకుండా, విధివిధానాలు రూపొందించకుండా... పాఠశాలలు ప్రారంభిస్తామని ఎలా ప్రకటించారని ప్రశ్నించింది. మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో తల్లిదండ్రుల్లో సహజంగానే ఆందోళన నెలకొందని.. చిన్న పాఠశాలల్లో భౌతికదూరం సాధ్యం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ఇటీవల ఇంటర్ పరీక్షలపై విచారణ సందర్భంగా.. ఒక్క విద్యార్థి ప్రాణానికి ఏమైనా జరిగినా బాధ్యత వహించాల్సి ఉంటుదంని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. మరోవైపు తల్లిదండ్రుల సంఘాల నుంచీ వ్యతిరేకత వ్యక్తమైంది. కరోనా తీవ్రత ఇంకా కొనసాగుతున్నందున... ఇప్పుడే పిల్లలను పంపించలేమని అభ్యంతరం వ్యక్తం చేశారు.
విధివిధానాల రూపొందించి...
యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి... పాఠశాలలు ఫీజులు వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం పాఠశాలలు తెరుస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృత ప్రచారం సాగుతోంది. వీటన్నింటిని పరిశీలించిన తర్వాత... ప్రభుత్వం పునరాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జులై 1 నుంచి పాఠశాలలు, గురుకులాల్లో ఆన్‌లైన్ తరగతులే ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. మొదట కళాశాలలు తెరిచి.. పరిస్థితిని బట్టి బడుల్లో ప్రత్యక్షబోధనపై నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. విధివిధానాలు రూపొందించి.. ఉన్నత న్యాయస్థానం అనుమతి తీసుకోవాలని భావిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.