వచ్చే రెండేళ్లలో 35.45 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించే పనులు పూర్తి చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్దేశించుకొంది. గత రెండేళ్లలో పలు ప్రాజెక్టుల్లో ప్రధాన పనులను పూర్తి చేసినా ఆయకట్టు మాత్రం తక్కువగానే సాగులోకి వచ్చింది. నాలుగు భారీ ప్రాజెక్టులు, ఒక మధ్యతరహా ప్రాజెక్టు కింద కలిపి 2.23 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సామర్థ్యాన్ని కల్పించినట్లు గురువారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫలితాల నివేదికలో ప్రభుత్వం వెల్లడించింది.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 17.123 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీటి సామర్థ్యాన్ని కల్పించడంతోపాటు 13.57 లక్షల ఎకరాలను స్థిరీకరించినట్లు పేర్కొంది. మొత్తమ్మీద కోటి 25 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించడం లక్ష్యంగా పేర్కొంది. వచ్చే రెండు మూడేళ్లలో 28 ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని సాగునీటి డిమాండుపై ఇచ్చిన వివరణ పత్రంలో పేర్కొంది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, సీతారామ ఎత్తిపోతల సహా నిర్మాణంలో ఉన్న ప్రధాన ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసే వాటి జాబితాలో చేర్చింది.
వచ్చే నీటి సంవత్సరం 22.68 లక్షల ఎకరాలు లక్ష్యం
2021-22వ నీటి సంవత్సరంలో భారీ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకొంది. 17 భారీ ప్రాజెక్టులు, ఐదు మధ్యతరహా ప్రాజెక్టులతోపాటు చిన్ననీటివనరులు, టీఎస్‌ఐడీసీ ఆధ్వర్యంలోని ఎత్తిపోతల కింద కింద కలిపి 22.68 లక్షల ఎకరాల ఆయకట్టును సాగులోకి తేవాలని నిర్దేశించుకొంది. వచ్చే ఖరీఫ్‌లోగా ఇంత ఆయకట్టుకు సాగునీరందించే పనులు పూర్తి చేయడం ప్రభుత్వానికి సవాలుతో కూడుకున్న పనే. కాళేశ్వరం కింద అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల కింద నిర్మాణంలో ఉన్న డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేస్తే నాలుగున్నర లక్షల ఎకరాలకు నీరందుతుంది. ఇప్పటివరకు 68 శాతం పనులు పూర్తయ్యాయని, మొత్తం పనులు 2021 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది.
ఇవీ లక్ష్యాలు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కింద సుమారు రూ.11 వేల కోట్లు ఖర్చు చేశామని, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.పదివేల కోట్లు రుణం తీసుకొన్నామని, 2022 జూన్ నాటికి పూర్తి స్థాయిలో పూర్తి చేయడం లక్ష్యమని తెలిపింది.
3.61 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే డిండి ఎత్తిపోతలలో 29.18% పనులు పూర్తయ్యాయని, 2022 అక్టోబరు నాటికి పూర్తి చేస్తామని తెలిపింది. ఇప్పటివరకు రూ.1825.26 కోట్లు ఖర్చు చేశామంది.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనిని ఈ ఏడాది డిసెంబరు ఆఖరుకు పూర్తి చేయడం లక్ష్యంగా ప్రకటించింది. ఉదయసముద్రం ఎత్తిపోతలను 2022 మార్చి నాటికి లక్ష్యంగా పెట్టుకొంది.
కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల పనులను వచ్చే జులై నాటికి అన్ని రకాల పూర్తి చేయాలని నిర్ణయించింది.
దేవాదుల మొదటి, రెండో దశ డిస్ట్రిబ్యూటరీలతోపాటు మూడోదశను వచ్చే జులై నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది.
సీతారామ ఎత్తిపోతల కింద ఈ ఏడాది జూన్‌లో పాక్షిక ప్రయోజనాలను సాధించడంతోపాటు 2023 మార్చి నాటికి మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది లక్ష్యం.
2022-23వ నీటి సంవత్సరంలో 15 భారీ ప్రాజెక్టులు, మూడు మధ్యతరహా ప్రాజెక్టుల కింద మరో 12.77 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా పెట్టుకొంది. అయితే వచ్చే రెండేళ్లలో లక్ష్యంగా పెట్టుకొన్న ఆయకట్టుకు నీరందాలంటే దీనికి తగ్గట్లుగా నిధులు ఖర్చుచేయడంతోపాటు పనుల వేగాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉంది.
- ఇదీ చదవండి : నేటితో ముగియనున్న బడ్జెట్ సమావేశాలు