ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతుల్లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం సహా పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను తక్షణమే నిలిపేలా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌కు లేఖ రాశారు.
ఎన్జీటీ స్టే ఇచ్చినా..
జాతీయ హరిత ట్రైబ్యునల్ స్టే విధించినప్పటికీ.. ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఎన్టీజీ ఆదేశాలు అమలు చేయాల్సిన కృష్ణా బోర్డు వాటిని అడ్డుకోలేకపోయిందన్నారు. డీపీఆర్ కోసం ప్రాథమిక పనులు చేస్తున్నామని చెప్పిన ఏపీ ప్రభుత్వం అక్కడ ప్రాజెక్టు పనులను కొనసాగిస్తున్నారని ఆక్షేపించారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు కృష్ణా బోర్డు.. కనీసం నిజనిర్ధారణ కమిటీనీ అక్కడకు పంపలేక పోయిందన్న రాష్ట్ర ప్రభుత్వం.. బోర్డు ఆనుమతులు, ఆమోదం లేకుండా పనులు చేపట్టరాదని కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశించిన విషయాన్ని లేఖలో గుర్తు చేసింది.
తక్షణమే నిలిపేసేలా..
ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏపీ వైఖరిని తీవ్రంగా నిరసించారన్న రజత్ కుమార్... ఏపీ చర్యలతో తెలంగాణలో కృష్ణా బేసిన్లో ఉన్న కరవు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలపై ప్రభావం పడుతుందని తెలిపారు. అనుమతుల్లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను తక్షణమే నిలిపేసేలా తగు చర్యలు తీసుకోవాలని బోర్డుకు విజ్ఞప్తి చేశారు.
న్యాయబద్ధమైన వాటాను పరిరక్షించాలి..
కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయబద్ధమైన వాటాను పరిరక్షించాలని కోరారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించిన చిత్రాలనూ లేఖతో జతపరిచారు.
ఇవీచూడండి: Water Disputes: ఏపీ పాలకులు అన్యాయం చేస్తుంటే ఊరుకోం: శ్రీనివాస్ గౌడ్
Anil kumar: తెలంగాణలో అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు చేపడుతున్నారు