రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని స్ట్రాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సాంకేతికపరమైన మార్పులు, చేర్పులు చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ చట్టం నిబంధన 5 ప్రకారం రేపటి నుంచి తిరిగి ఉత్తర్వులు ఇచ్చే వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఇప్పటికే ఈ - స్టాంపులు కొనుగోలు చేసి, చలానాలు చెల్లించిన వారికి చెందిన రిజిస్ట్రేషన్లు ఇవాళ కొనసాగుతాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ చిరంజీవులు తెలిపారు. ఈ - స్టాంపులకు సంబంధించి ఇప్పటికే విక్రయాలు పూర్తిగా నిలిపివేసినట్లు వెల్లడించారు.