మాజీ హాంమంత్రి నాయిని నర్సింహరెడ్డి కన్నుమూశారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12.25 గంటలకు తుది శ్వాస విడిచినట్లుగా అపోలో వైద్యులు ప్రకటించారు. కరోనాతో నాయిని ఆసుపత్రిలో చేరారాని.. తీవ్రమైన లంగ్ ఇన్ఫెక్షన్ కావడంతో మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.
తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో నాయిని కీలకంగా వ్యవహరించారు. నాయినికి భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాయిని.. స్వగ్రామం నల్గొండ జిల్లా దేవరకొండ మండలం నేరెడిగొమ్ము. 1970లో హైదరాబాద్కు మాకాం మార్చారు నర్సింహారెడ్డి. రాష్ట్రంలో కార్మిక సంఘ నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
జనతా పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించిన నాయిని.. పలు ప్రముఖ కంపెనీల్లో కార్మిక నాయకునిగా ఎన్నికయ్యారు. 1978లో మొదటి సారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముషిరాబాద్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2001లో తెరాస పార్టీలో చేరిన నాయిని మలిదశ తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కేసీఆర్ వెన్నంటే ఉండి కీలక పాత్ర పోషించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. 2014-18 మధ్యలో తెలంగాణ తొలి హోంమంత్రిగా నాయిని పనిచేశారు.