Telangana Formation Day Celebrations 2022: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రానికి సేవ చేస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నానని గవర్నర్ తెలిపారు. తాను రాష్ట్రానికి గవర్నర్ కాదు.. మీ అందరి సహోదరిని అని గవర్నర్ తమిళిసై అన్నారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు.
'నేను రాష్ట్రానికి గవర్నర్ కాదు.. మీ అందరి సహోదరిని. రాష్ట్రానికి సేవ చేయడానికి ప్రధాని అవకాశం కల్పించారు. రాజ్ భవన్ స్కూల్ లొ భోజన సౌకర్యం కల్పించాం. భద్రాచలం, ఖమ్మం ఆదివాసులతో భోజనం చేసి.. పౌష్టికాహారం ఇచ్చాం. రాష్ట్రానికి సేవ చేస్తూ ఎన్నో సవాళ్ల ను ఎదుర్కొంటున్నాను. నేను బాధపడను..ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా నా సేవ తెలంగాణ ప్రజలకు అందిస్తున్నాను. ఎవ్వరు ఆపినా కూడా మీ అందర్ని కలుస్తున్నాను.'-గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
నా పుట్టిన రోజు కూడా ఈరోజే..
గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ పుట్టిన రోజు కూడా ఇదే రోజు కావటం దైవ సంకల్పంగా భావిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఆవిర్భావ వేడుకల కేక్‌తో పాటు పుట్టినరోజు కేక్ కూడా గవర్నర్ తమిళిసై కట్ చేసి రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అసెంబ్లీ, శాసనమండలిలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అసెంబ్లీ, శాసనమండలిలో ఘనంగా నిర్వహించారు. శాసనసభ ఆవరణలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి... గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూల మాల వేశారు. అనంతరం పోచారం శ్రీనివాస్‌రెడ్డి... జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శాసనమండలిలో జరిగిన కార్యక్రమంలో మండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి గాంధీ విగ్రహానికి పూల మాల వేసి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ ఎల్.రమణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొన్నారు.
ఇవీ చదవండి:8 వసంతాలు పూర్తి చేసుకున్న తెలంగాణ.. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు