Revanth on Telangana Formation: ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కల్పించే వరకు తాము విశ్రమించకుండా పోరాటం చేస్తూనే ఉంటామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ పోరాటంలో తమ ప్రాణాలు పోయిన వెనకడుగు వేసేది లేదని తెగేసి చెప్పారు. ఇందుకు అమెరికాలోని తెలంగాణ వాసులు తమతో కలిసి రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డల్లాస్‌లో ఎన్నారై కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పాల్గొన్నారు. డల్లాస్‌లోని కాంగ్రెస్ నాయకులు భారీ వాహనలతో ర్యాలీ నిర్వహించారు. దారిపొడవునా రేవంత్‌రెడ్డి బ్యానర్లు కట్టారు. డల్లాస్‌లో ఉన్న తెలంగాణవాసులు అవతరణ వేడుకల్లో పెద్దఎత్తున పాల్గొన్నారు. రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సభకు హాజరైనవారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి అంతా కలిసి రావాలని కోరారు.
ఎక్కడో మారుమూల పల్లెల్లో పుట్టి అమెరికాలో ఎంతగానో ఎదిగిన తెలంగాణ వాసుల్ని చూస్తుంటే తమకు ఎంతో ఆనందంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికా అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం ఉండడం గర్వంగా ఉందని, ఎంతో శ్రమిస్తూ తెలంగాణ అభివృద్ధి, దేశాభివృద్ధి కోసం పాటు పడుతున్నారని కొనియాడారు. తెలంగాణ కోసం ఎంతో మంది యువకులు, విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేశారని, వారి త్యాగం, సోనియమ్మ దీవెన వల్లనే తెలంగాణ ఏర్పడిందన్నారు. అన్ని పార్టీలను ఒప్పించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మకు తెలంగాణ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి బహుమతి ఇవ్వాలని, అప్పుడే ఏ లక్ష్యం కోసమైతే రాష్ట్రం తెచుకున్నామో ఆ లక్ష్యం నెరవేరుతుందన్నారు.
"అమెరికాలో ఉండి...తెలంగాణలో అంతా బాగుందని అనుకుంటే లాభం లేదు. మేము ఓట్లు అడగడానికో, పార్టీ చందాలు అడగడానికో అమెరికాకు రాలేదు. తెలంగాణలో పరిస్థితులు బాగా లేవు.. కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు, బిడ్డ, సడ్డకుడి కొడుకు, బంధువులు, చుట్టాలు వేల కోట్ల రూపాయలు దోచేసి తెలంగాణాను బందీ చేశారు. మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పగిస్తే ఇప్పుడు ప్రజలకు అప్పులు, ఆత్మహత్యలే మిగిలాయి. ఉద్యోగాలు లేవు, సకాలంలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మ గౌరవం, స్వయం పాలన, సామాజిక న్యాయం కోసం తెచ్చుకున్న తెలంగాణా రాష్ట్రంలో ఏ ఒక్కటి నెరవేరలేదు. బానిస బతుకుల నుంచి విముక్తి కోసం కొట్లాడేందుకు తమ వెంట అమెరికాలోని తెలంగాణ వారు కూడా రావాలి... తలతెగి పడ్డ వెనుకడుగేసేది లేదు." -రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఇవీ చదవండి: