Cultivation in Telangana 2022 : దేశానికి అన్నం పెట్టే రైతన్న నోట్లోకి నాలుగు వేళ్లు పోవడమే కష్టంగా మారింది. పుడమి తల్లిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న అన్నదాతకు అడుగడుగునా కష్టాలే. ఎన్ని కష్టాలొచ్చినా.. ఎన్నిసార్లు నష్టపోయినా సాగు మాత్రం మానడు. కానీ కాస్త దృష్టి పెట్టి.. సాంకేతికత దన్నుతో కృషి చేస్తే సాగులో రైతుకు తిరుగులేదు. కొద్దిపాటి మెలకువలతో ప్రతి రైతు తన ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు మాత్రం కచ్చితంగా ఉన్నాయి. అవి ఇలా..
Telangana Cultivation 2022 : పెట్టుబడిని తగ్గించుకోవాలి: వ్యవసాయానికి భారీ పెట్టుబడి అవసరమనే పరిస్థితి మారాలి. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారకాల ధరలు, కూలీల భారం వంటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పెట్టుబడిని తగ్గించుకోవాలి. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి లాభాల బాట పట్టాలి.
Telangana Crops 2022 : విత్తు మంచిదైతే..: విత్తనం బాగుంటే పంట దిగుబడి 25% పెరుగుతుంది. నాణ్యమైన విత్తనాన్ని.. నమ్మకమైన సంస్థ నుంచి కొనుగోలు చేయాలి. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవాలి. మొలక శాతం పరీక్షించుకోవాలి. విత్తనశుద్ధి చేసుకోవడం ద్వారా చీడపీడలను దూరం చేసుకునేందుకు వీలుంటుంది. సాధ్యమైనంత వరకు మనం పండించే పొలంలోనే.. ఎలాంటి తెగుళ్లు లేని మొక్కలను గుర్తించి వాటి నుంచి విత్తనం సేకరించుకుంటే ఖర్చు తగ్గుతుంది.
Telangana Kharif Crops 2022 : సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే.. : వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత కీలకం. సమర్థ నీటి నిర్వహణ, కలుపుతీతలో కొత్త విధానాలొచ్చాయి. సూక్ష్మ, బిందు సేద్యం విధానాలతో నీటిని ఆదా చేసుకోవచ్చు. వాటి ద్వారా ఎరువులు అందించి.. ఖర్చు తగ్గించుకోవచ్చు. మల్చింగ్ ద్వారా నేలలో తేమను నిల్వ చేసుకోవడంతోపాటు కలుపు మొక్కల పెరుగుదలనూ నిరోధించవచ్చు. నేలలో తేమశాతాన్ని కొలిచే పరికరాలు, కోత యంత్రాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. డ్రోన్ ఆధారిత పురుగు మందుల పిచికారీ.. యాప్‌లతో పురుగులు, తెగుళ్లను గుర్తించే పరిజ్ఞానాలను అందిపుచ్చుకోవాలి.
Telangana Dairy farming 2022 : పాడి తోడైతే.. ఒక ఆవు/గేదె ఉంటే రెండెకరాలకు సరిపడా సేంద్రియ ఎరువు వస్తుంది. ఆవులు, గేదెల ద్వారా ఇంటిల్లిపాదికి పాలు, పెరుగు లభిస్తాయి. నెలకు రూ.4 - 5 వేల ఆదాయమూ వస్తుంది. ఎడ్లు, దున్నలతో గొర్రు, గుంటక, నాగళ్లు తదితర సేద్య ఖర్చుల రూపంలో ఎకరాకు రూ.3,500 ఆదా అవుతాయి.
Telangana Poultry farming 2022 : కోళ్లు, మేకలు, చేపల పెంపకమూ..: పాడి, పంటతోపాటు కోళ్లు, మేకలు/గొర్రెలు, చేపల పెంపకంపైనా రైతులు దృష్టి సారించాలి. చేపల పెంపకం ద్వారా ఆదాయం వస్తుంది. నాటుకోళ్లకు డిమాండు అధికంగా ఉంది. కొద్దిసంఖ్యలో పెంచుకుంటే.. వీటికి ప్రత్యేక పోషణ ఖర్చులేమీ ఉండవు. సంతతి ఏటికేడు వృద్ధి చెందుతుంది.
తిమ్మయ్య ఏం చేస్తున్నారు?
telangana cultivation methods 2022 : ఉన్న భూమిలోనే అంతరపంటలు, ఒకే పంటపై ఆధారపడకుండా వేర్వేరు పంటలు వేస్తే అద్భుతాలు చేయొచ్చు. కర్ణాటకలోని మైసూరు ప్రాంతానికి చెందిన తిమ్మయ్య తన పొలం తూర్పు, పడమరల్లో కొబ్బరి మొక్కలు నాటారు. వాటి నడుమ సపోటా, అరటి మొక్కలు నాటారు. కొబ్బరిచెట్ల కింద వక్క, మిరియాలు, ఇతర మొక్కలు వేశారు. ఉత్తర, దక్షిణాల్లో మామిడి, నేరేడు, పనస, నిమ్మ, మునగ చెట్లు నాటారు. పొలంలో ఆకుకూరలు, తృణధాన్యాలు.. భూమి లోపల పసుపు, అల్లం, క్యారెట్, ఆలుగడ్డలనూ పండిస్తున్నారు. అనేక ఔషధమొక్కలూ నాటారు. వేర్వేరు పంటల సాగుతో సస్యరక్షణ మెరుగైంది. భూసారం పెరుగుతోంది. నీడ వల్ల నీరు ఆవిరవడం తగ్గింది. ఏడాది పొడవునా రాబడి ఉంటోంది.
అరచేతిలో సమాచారముండాలి: పంటలకు దేశంలో ఏ మార్కెట్‌లో ఎంత ధర లభిస్తోందనే సమాచారాన్ని వెబ్‌సైట్లు, టెలిగ్రామ్, వాట్సప్ గ్రూపులతో తెలుసుకోవాలి. హోల్‌సేల్ మార్కెట్లకు సరఫరా చేస్తే మంచి ధర వస్తుంది. రైతు ఉత్పత్తి సంఘాలుగా ఏర్పడి.. ఇతర రాష్ట్రాలు, దేశాలకూ వ్యవసాయ, ఉద్యాన, మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేయొచ్చు.