పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా లభించే స్వచ్ఛమైన తేనెకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండు పెరుగుతోంది. తేనెలోని సుగుణాలు, డిమాండ్ దృష్ట్యా, కల్తీలను నివారించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తేనె టీగల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. రైతులకు రుణంతోపాటు మొత్తం వ్యయంలో 40% రాయితీ ఇస్తుంది. అయినా రాష్ట్రంలో తేనె టీగల పెంపకంపై రైతులు ఆసక్తి చూపడంలేదని రాష్ట్ర ఉద్యానశాఖ చెబుతోంది.
అంతర్జాతీయ తేనెటీగల పెంపకం దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉద్యానశాఖ గురువారం ఆన్‌లైన్‌లో వెబినార్ నిర్వహిస్తోంది. అన్ని పంటల్లో తేనె ఉత్పత్తి- ఆదాయం తదితర అంశాలపై అవగాహన కల్పించనుంది. రైతులకు పెద్దగా ఖర్చు లేకుండా తేనె ఉత్పత్తి ద్వారా ఆదాయం పెంచుకోవచ్చని ఉద్యానశాఖ రాష్ట్ర సంచాలకుడు ఎల్.వెంకట్రామ్‌రెడ్డి ‘ఈనాడు’కు చెప్పారు. మన దేశం నుంచి తేనె ఎగుమతులు.. 2013-20 మధ్యకాలంలో 28,378 టన్నుల నుంచి 59,536 టన్నులకు చేరాయి. అంటే 109 శాతం పెరుగుదల నమోదైంది. ఈ డిమాండ్‌ను రైతులకు ఆదాయంగా మార్చేందుకు ‘జాతీయ తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తి మిషన్’ను కేంద్రం ఇటీవల ఏర్పాటు చేసింది. దీని అమలుకు ‘ఆత్మనిర్భర్ భారత్’ పథకంలో మూడేళ్ల(2020-23)లో రూ.500 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే రూ.150 కోట్లు విడుదల చేసింది.
రూ.2.50 లక్షల వ్యయం
తేనెటీగల పెంపకానికి డబ్బాలతో కాలనీలు ఏర్పాటు చేస్తారు. ప్రతి 8 డబ్బాలను కలిపి ఒక కాలనీ అంటారు. ఇలా 50 కాలనీలు ఏర్పాటుచేయడానికి సుమారు రూ.2.50 లక్షల వ్యయమవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా. ఇందులో 40 శాతం లేదా గరిష్ఠంగా రూ.88 వేల మొత్తాన్ని రాష్ట్రాల ఉద్యానశాఖల ద్వారా రైతులకు రాయితీగా ఇస్తోంది. మిగతా మొత్తాన్ని ఉద్యానశాఖ బ్యాంకు నుంచి రుణంగా ఇప్పిస్తుంది.
- ఇదీ చదవండి : డీఏపీ ఎరువుపై భారీ రాయితీ: కేంద్రం