గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించేందుకు తెలంగాణ ఇంజినీర్ల కమిటీ రెండు ప్రతిపాదనలను రూపొందించింది. కంతనపల్లి దిగువన రాంపూర్ వద్ద ఆనకట్ట నిర్మించి నాగార్జున సాగర్‌కు, శ్రీశైలానికి నీటిని మళ్లించేలా వీటిని సిద్ధం చేశారు. రోజుకు రెండు టీఎంసీల నీటిని కృష్ణాకు తరలించేలా రూపొందించారు. రాంపూర్ నుంచి సాగర్‌కు నీరు మళ్లించే ప్రతిపాదనకు 67 వేల 500 కోట్లు, శ్రీశైలానికి నీరు తరలించే ప్రతిపాదనకు 77వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా వేశారు.
85 మీటర్ల పూర్తిస్థాయి మట్టంతో బ్యారేజీ
గోదావరిపై రాంపూర్ వద్ద 85 మీటర్ల పూర్తి స్థాయి నీటిమట్టంతో ఆనకట్ట నిర్మిస్తారు. అక్కడి నుంచి 47 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా నీటిని మళ్లించి 130 మీటర్ల పైకి ఎత్తిపోసి లక్నవరం చెరువుకు తరలిస్తారు. సొరంగమార్గం 23 కిలోమీటర్ల మేర వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉన్నందువల్ల ఎస్సెల్బీసీ తరహాలో టన్నెల్ బోరింగ్ యంత్రం ద్వారా తవ్వాల్సి ఉంటుంది.
మూసీ దాటేలా అక్విడెక్టు
లక్నవరం నుంచి మరో 18 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వి 90 మీటర్ల ఎత్తిపోతలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 38వ డీబీఎంలో 20వ కిలోమీటర్ వద్ద నీటిని పోస్తారు. 99వ కిలోమీటర్ వరకు కాకతీయ కాల్వను ఈ పథకానికి వినియోగిస్తారు. కాల్వ సామర్థ్యాన్ని రెండు టీఎంసీలకు తగ్గట్లుగా నిర్మించాల్సి ఉంటుంది. మధ్యలో మూసీ నదిని దాటేలా అక్విడెక్టు నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి జలాల తరలింపునకు రెండు వేర్వేరు ప్రతిపాదనలు రూపొందించారు.
మొదటి ప్రతిపాదన
మొదటి ప్రతిపాదన ప్రకారం మూసీపై అక్విడెక్టు నుంచి 55 కిలోమీటర్ల దూరం కాల్వ తవ్వి చర్లపల్లి నుంచి ఉదయసముద్రం బ్యాలెన్సింగ్ జలాశయానికి నీటిని మళ్లించాలి. హాలియా నదిపై కంగలవాగు వద్ద ఆనకట్ట నిర్మించి సాగర్ ఆయకట్టుకు, మరో అనుసంధానం ద్వారా డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కిష్టంపల్లి జలాశయానికి నీటిని తరలించాలి. దీనికి 61 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాలు, 174 కిలోమీటర్ల కాల్వ, 78 కిలోమీటర్ల లింకు కాల్వ సహా 220 మీటర్ల ఎత్తుతో ఎత్తిపోతలు చేపట్టాల్సి ఉంటుంది.
రెండో ప్రతిపాదన
రెండో ప్రతిపాదన ప్రకారం మూసీ అక్విడెక్టు నుంచి 70 కిలోమీటర్ల దూరం కాల్వ తవ్వి సాగర్ ఎడమగట్టు పరిధిలోని ఉదయసముద్రం, దేవులపల్లి చెరువుకు మళ్లించాలి. కాల్వ చివర్లో 234 మీటర్ల నుంచి 274 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేందుకు 40 మీటర్ల ఎత్తుతో ఎత్తిపోతల నిర్మించాలి. 30 కిలోమీటర్ల దూరం కాల్వ ద్వారా నీరు మళ్లించాల్సి ఉంటుంది. మరలా 45 మీటర్ల లిఫ్ట్ తో 310 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయాలి. అక్కడి నుంచి 70కిలోమీటర్లు సొరంగమార్గం తవ్వి ఒక టీఎంసీ నీటిని శ్రీశైలం జలాశయంలో 270 మీటర్ల వద్ద పోయాల్సి ఉంటుంది.
రెండో ప్రతిపాదనలో 131కిలోమీటర్ల మేర సొరంగం, 229 కిలోమీటర్ల దూరం ప్రధాన కాల్వ, 25 కిలోమీటర్ల మేర లింక్ కాల్వలు తవ్వడంతో పాటు 305 మీటర్ల ఎత్తుతో ఎత్తిపోతలు నిర్మించాల్సి ఉంటుంది. హైదరాబాద్ జలసౌధ వేదికగా జరిగిన రెండు రాష్ట్రాల ఇంజినీర్ల కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించారు.
ఇదీ చూడండి : భద్రతావలయంలో బీఆర్కేఆర్ భవనం