వేతన సవరణ అమలు ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల కూడా పాత వేతనాలనే అందనున్నాయి. ఒక్కో ఉద్యోగికి సంబంధించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని వేతనస్కేలు, భత్యాలను ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆ దిశగా ఆర్థికశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
సమయం పట్టే అవకాశం
పెరిగిన వేతనాలు, వాటి వివరాలతో ఆర్థికశాఖ ప్రత్యేకంగా కంప్యూటర్ ప్రోగ్రాంను రూపొందించింది. ఉద్యోగులు తమకు సంబంధించిన ప్రతిని డౌన్‌లోడ్ చేసుకుని పరిశీలించి సంతకం చేసి ఇవ్వాలి. ఆ తర్వాత మిగతా ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిష్కరించాలి. అందుకోసం కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
కసరత్తు అనంతరమే ట్రెజరీకి
ఈ కారణాల వల్ల అధికారులు జూన్‌కు సంబంధించి పాత వేతనాలతోనే బిల్లులు సిద్ధం చేసి ట్రెజరీకి పంపుతున్నారు. వాటి ప్రకారమే జూలై ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు అందనున్నాయి. పెరిగిన వేతనాలకు సంబంధించిన కసరత్తు పూర్తయ్యాక అనుబంధ బిల్లులను ట్రెజరీకి పంపుతారు. అప్పుడు మిగతా మొత్తం ఉద్యోగుల ఖాతాల్లో జమవుతుంది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో ప్రవేశపరీక్షలకు షెడ్యూల్ విడుదల