పీక్ సీజన్ కాకపోయినా.. దేశవ్యాప్తంగా విద్యుత్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. దీనికి ప్రధాన కారణం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గిపోవడమే అని.. విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి విద్యుత్ అవసరాలు వస్తాయని భావించిన విద్యుత్ శాఖ ప్రతి వర్షాకాలం సీజన్లో ఓవర్ హాల్ చేయడాన్ని వాయిదా వేసుకుంది. దీంతో పాటు జనరేషన్ లోడ్‌నూ తగ్గించుకుంది. అయినా రాష్ట్ర అవసరాలకు మించి విద్యుత్ అందుబాటులో ఉండడంతో మిగిలిన విద్యుత్‌ను జెన్కో ఎక్సేంజ్‌లో విక్రయించింది.
తెలంగాణ విద్యుత్ శాఖ రికార్డు..
గత కొద్దిరోజులుగా బొగ్గు రవాణా తగ్గిపోవడం వల్ల విద్యుత్‌కు డిమాండ్ ఏర్పడింది. విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాల్లో సాధారణంగా 21 రోజుల వరకూ పనిచేసేలా బొగ్గు నిల్వ ప్రణాళికలు వేసుకుంటారు. కనీసం 15 రోజుల వరకు బొగ్గు నిల్వ ఉంచుకోవాలని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ అవి కూడా నిండుకొనే పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలూ విద్యుత్ ఉత్పత్తి విషయంలో పునరాలోచనలో పడిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రం.. తన అవసరాలకు సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం సహా.. మిగిలిన విద్యుత్‌ను ఎక్సేంజ్‌లో విక్రయించింది. ఇదో రికార్డుగా విద్యుత్ శాఖ భావిస్తోంది.
215 మిలియన్ యూనిట్ల విక్రయం..
గడిచిన 15 రోజుల్లో విద్యుత్ శాఖ 215 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఎక్సేంజ్‌లో విక్రయించింది. తద్వారా విద్యుత్ శాఖకు రూ.115 కోట్ల ఆదాయం సమకూరింది. నిత్యం విద్యుత్ శాఖ.. ఎక్సేంజ్‌లో విద్యుత్‌ను కొనుగోలు చేయడమే కానీ అమ్మడం చాలా అరుదు.. అలాంటిది గత రెండు వారాలుగా.. విద్యుత్‌ను విక్రయిస్తోంది. దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలో పూర్తిస్థాయిలో హైడల్ పవర్ ఉత్పత్తి కావడమేనని నిపుణులు చెబుతున్నారు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే కేవలం తెలంగాణలోనే హైడల్ పవర్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది.
గత వారం రోజులుగా ఉత్పత్తి ఇలా..
గత కొద్దిరోజులుగా తెలంగాణ.. పూర్తిస్థాయిలో హైడల్, థర్మల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. సోమవారం (ఆగస్టు 30) న 74 మిలియన్ యూనిట్లు థర్మల్, 12 మిలియన్ యూనిట్లు హైడల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. ఆదివారం ( ఆగస్టు 29)న 39 మిలియన్ యూనిట్ల హైడల్, 63 మిలియన్ యూనిట్ల థర్మల్, శనివారం( ఆగస్టు 28 )న 40 మిలియన్ యూనిట్ల హైడల్, 60 మిలియన్ యూనిట్ల థర్మల్, శుక్రవారం (ఆగస్టు 27న) 40 మిలియన్ యూనిట్ల హైడల్, 70 మిలియన్ యూనిట్ల థర్మల్ విద్యుత్ ను ఉత్పత్తి చేసింది.
గతేదాడి రికార్డు స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి..
అప్పర్ జూరాల, లోయర్ జూరాల, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్, నాగార్జున సాగర్, నాగార్జున సాగర్ ఎడమ కాల్వ, పులిచింతల, సింగూరు, నిజాం సాగర్, పోచంపాడు, పాలేరు, పెద్దపల్లి జిల్లాలోని జలవిద్యుత్ కేంద్రాలతో కలిపి 2014-15లో 3,128.784 మిలియన్ యూనిట్లు, 2015-16లో 284.995 మిలియన్ యూనిట్లు, 2016-17లో 1,307.128 మిలియన్ యూనిట్లు, 2017-18లో 1,519.235 మిలియన్ యూనిట్లు, 2018-19లో 1,751.744 మిలియన్ యూనిట్లు, 2019-20లో అత్యధికంగా రికార్డు స్థాయిలో 4,510.2008 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయినట్లు అధికారులు వెల్లడించారు. 2020-21లో 1,000 మిలియన్ యూనిట్ల పైచిలుకు ఉత్పత్తి చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది జల విద్యుత్ ఉత్పత్తి మరింత పెరిగే అవకాశముందని జెన్కో భావిస్తోంది.
ఇదీచూడండి: KRMB MEETING: కేఆర్ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్