పదవీకాలం పూర్తయిన, వివిధ కారణాలతో ఖాళీ అయిన పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణ కోసం వార్డుల వారీ ఓటర్ల జాబితా తయారీకి ఎస్ఈసీ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా పోలింగ్ కేంద్రాల గుర్తింపునకు కూడా షెడ్యూల్ ప్రకటించింది. వీటితో పాటు మరో ఎనిమిది మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు కూడా షెడ్యూల్ ఇచ్చింది.
నేడు పోలింగ్ కేంద్రాల ముసాయిదా తయారీ చేసి ఎనిమిదిన ప్రచురించాలి. దానిపై 11వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరించి, వాటిని పరిష్కరించాక 14వ తేదీన తుది పోలింగ్ కేంద్రాలను ప్రకటించాల్సి ఉంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డుసభ్యుల స్థానాల్లోనూ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆయా జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి నేడు దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల ముందస్తు ఏర్పాట్లు, సన్నాహాలపై సమీక్షించి వారికి అవసరమైన ఆదేశాలు జారీ చేస్తారు.
ఇవీ చూడండి: '45 ఏళ్లు నిండిన ఉద్యోగులకు టీకా తప్పనిసరి'