కరోనా చికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తున్న ఇతర రాష్ట్రాల రోగులను తాము అడ్డుకోవడంలేదని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో అంబులెన్సులను ఆపడంలేదని ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంతోమందికి తెలంగాణలో వైద్య సేవలు అందిస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో దాదాపు 50శాతం మంది మహారాష్ట్ర వారే ఉన్నారని.... గాంధీలోనూ ఇతర రాష్ట్రాల వారికి వైద్యం అందిస్తున్నామని అన్నారు. తెలంగాణలో కరోనా చికిత్స పొందుతున్న వారిలో దాదాపు 40 నుంచి 45 శాతం మంది ఇతర రాష్ట్రాల వారేనని శ్రీనివాసరావు తెలిపారు.
మేం ఎప్పుడూ చెప్పలేదు...
ఇతర రాష్ట్రాల వారికి తెలంగాణలో వైద్యసేవలు అందించబోమని తామెప్పుడూ చెప్పలేదని... ఏ రాష్ట్రానికి చెందిన వారైనా... తెలంగాణకు వచ్చి చికిత్స పొందవచ్చని డీఎంహెచ్ఓ శ్రీనివాసరావు వివరించారు. కరోనా మొదటి దశలో కేవలం 5 0శాతం పడకలు నిండగా.. రెండో దశలో మాత్రం ఇప్పటికే 80 నుంచి 90 శాతం బెడ్లు నిండిపోయాయని తెలిపారు. కేవలం 20 ప్రైవేటు ఆస్పత్రుల్లోనే అందరూ బెడ్లు కావాలనుకుంటున్నారని శ్రీనివాసరావు అన్నారు. ఆస్పత్రుల్లో పడకల వివరాలను డాష్‌బోర్డులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నామని చెప్పిన డీఎంహెచ్ఓ... ముందుగానే పడకలు రిజర్వు చేసుకోవడం వల్ల ఇబ్బందులు తప్పుతాయని సూచించారు.
ఇబ్బందిపడకుండా ఏర్పాట్లు...
ఈరోజు ఉదయం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐదుగురు రోగులను రాష్ట్రంలోకి అనుమతి ఇచ్చామని డీహెచ్ వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషెంట్స్ కోసం స్టేట్ కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మన దగ్గర మెడిసిన్, బెడ్స్‌ని ఇతర రాష్ట్రాల వారితో పంచుకుంటున్నామన్న ఆయన.. బిహార్, దిల్లీ నుంచి సైతం రోగులు ఇక్కడికి వస్తున్నారని అన్నారు. కేంద్రం ఇస్తున్న ఆక్సిజన్ ఏ రోజుకి ఆ రోజే సరిపోతుందని.. ఫలితంగా ఆక్సిజన్ ఆడిట్ విధానం పెట్టుకున్నామని స్పష్టం చేశారు.
సరిహద్దు రాష్ట్రాలూ.... తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి కోరారు. ఇతర రాష్ట్రాలు ముందుకొచ్చి ఆక్సిజన్, ఔషధాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. అనవసరంగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా చితికి పోవద్దని ప్రజలకు సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.