రాష్ట్రంలో మరో 10వేల పడకలకు ఆక్సిజన్ సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. రోగులకు 60వేల పడకలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై సీఎస్ సోమేశ్, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
కొవిడ్ రోగుల కోసం అన్ని జిల్లాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు సీఎస్ చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొవిడ్ హెల్ప్ కాల్ సెంటర్ నంబర్ 040-21111111 అని ప్రకటించారు. కరోనా రోగులకు ఇంటి వద్దకే మెడికల్ కిట్లు పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతమున్న 7.50 లక్షల కిట్లకు తోడు మరో 5 లక్షల మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని వెల్లడించారు.
సీఎం ఆదేశాల మేరకు అదనపు పడకలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. నిమ్స్‌లో-500, సరోజినీదేవి, టిమ్స్‌లో-200 చొప్పున, గోల్కొండ, మలక్‌పేట ఆస్పత్రుల్లో-100, అమీర్‌పేట్, ఛాతీ ఆస్పత్రిలో-50 చొప్పున పడకలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.