తెలంగాణలో వడ్ల కొనుగోలు అంశం రాజకీయ రంగు పులుముకుంది. భాజపా, తెరాసలు పోటాపోటీగా నిరసనలు చేస్తుండగా.. ఇప్పుడు ఆ రెండు పార్టీలను కార్నర్ చేస్తూ కాంగ్రెస్ గ్రౌండ్‌లోకి దిగింది. ఇటీవల కర్షకా కదిలిరా అంటూ పీసీసీ నిర్వహించిన నిరసన ర్యాలీలో పెద్ద సంఖ్యలో అన్నదాతలు హైదరాబాద్ తరలివచ్చారు. ఈ ర్యాలీలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతు ఎజెండాను ప్రకటించారు. రాష్ట్రంలో పండిన ప్రతి వడ్ల గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
కల్లాల్లోకి కాంగ్రెస్‌తో ఒత్తిడి..
ప్రస్తుతం.. కల్లాల్లోకి కాంగ్రెస్ అంటూ కార్యాచరణను తీసుకున్న కాంగ్రెస్.. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. రైతులతో సమావేశమవుతూ.. తమ డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నెల 23వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ.. కేసీఆర్‌కు డెడ్‌లైన్ విధించింది. 23 లోపు వడ్లకొనుగోలు విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోకుంటే ప్రగతిభవన్ ముట్టడిస్తామని రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
క్రెడిట్ రాజకీయాలు..
ఇంతలోనే ప్రధాని మోదీ... మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో క్రెడిట్ రాజకీయాలు మొదలయ్యాయి. తాము నిరసన చేయడం వల్లనే వ్యవసాయ చట్టాలు రద్దు అయ్యాయంటూ తెరాస నాయకులు పెద్ద ఎత్తున సంబురాలు చేశారు. కేసీఆర్ మహాధర్నా సెగ దిల్లీకి తగలడం వల్లనే మోదీ చట్టాలను వెనక్కి తీసుకున్నారని మంత్రులు సైతం ప్రకటలు చేస్తూ.. తెరాస క్రెడిట్ పొందే ప్రయత్నం చేస్తోంది. ఇదే అంశాన్ని తీసుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంటర్ రాజకీయాలకు తెరలేపారు. కేసీఆర్ మహాధర్నా వల్లనే చట్టాలు రద్దు అయ్యాయన్నా... ఆ క్రెడిట్ తెరాసనే తీసుకున్నా... కాంగ్రెస్‌కు ఏలాంటి ఇబ్బంది లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ మహాధర్నాతోనే వ్యవసాయ చట్టాలు రద్దు అయ్యాయంటున్నప్పుడు.. వడ్లకొనుగోలు విషయంలో ఎందుకు కేంద్రంపై ఒత్తిడి చేయడం లేదని నిలదీస్తున్నారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంపై కేసీఆర్ తెస్తున్న ఒత్తిడి అంతా ఉత్తిత్తి డ్రామనేనా అని కొట్టిపారేస్తున్నారు. రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా... వ్యవసాయ చట్టాల రద్దు మహాధర్నానే కారణమంటున్న కేసీఆర్ వడ్లు కొనుగోలుపై కూడా ఒత్తిడి తెచ్చి ప్రతి గింజా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కేంద్రాన్ని ఒప్పించకపోతే..
వ్యవసాయ చట్టాల రద్దును... తమ ఖాతాలో వేసుకున్న తెరాసకు కాంగ్రెస్ కౌంటర్ రాజకీయాలు కొంత ఇబ్బందికి గురి చేస్తున్నాయనే చెప్పాలి. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంపై కేసీఆర్ ఎందుకు చిత్తశుద్దితో ఒత్తిడి చేయలేకపోతున్నారని కాంగ్రెస్ నుంచి వస్తున్న ప్రశ్నలకు అధికార పార్టీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితిగా మారింది. ప్రస్తుతం దిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్... వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, ఒప్పించకుంటే... కాంగ్రెస్ నుంచి వచ్చే విమర్శలతో రాజకీయంగా తెరాసకు తలనొప్పులు తప్పకపోవచ్చు.
ఇదీ చూడండి: