Congress Digital Membership: డిజిటల్ సభ్యత్వాల నమోదులో రాష్ట్ర కాంగ్రెస్ వేగం అందుకుంది. గతేడాది అక్టోబరు రెండో తేదీ.. గాంధీ జయంతి రోజున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎన్‌రోలర్స్‌కు శిక్షణ ఇచ్చి బూత్‌స్థాయిలో నవంబరు 9 నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. జనవరి 26 నాటికి రాష్ట్రంలో 30 లక్షలు సభ్యత్వం పూర్తిచేయాలని పీసీసీ లక్ష్యంగా నిర్దేశించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద ఉన్న ఓటర్ల జాబితాను అనుసంధానం చేసి సభ్యత్వం చేసే కార్యక్రమం కావడంతో.. సాంకేతికంగా పరిజ్ఞానం కలిగిన 30వేల మందికిపైగా యువతను ఎన్‌రోలర్లుగా నియమించారు. కానీ కొవిడ్ కేసులు పెరగడం, పండుగలు రావడం, సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురవడం లాంటి కారణాలతో నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోయింది.
31 లక్షల సభ్యత్వాలు..
దీంతో జనవరి 30 వరకు పీసీసీ గడువు పెంచింది. అయినా పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో.. రెండోసారి ఫిబ్రవరి 9 వరకు పీసీసీ గడువు పెంచింది. ఈ నెల 5 వరకు రాష్ట్రంలో 31 లక్షలకుపైగా కాంగ్రెస్ సభ్యత్వాలు పూర్తయ్యాయి. అందులో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా.. 28 లక్షల ఎనిమిది వేల ఆరువందల సభ్యత్వాలు పూర్తికాగా.. మరో మూడు లక్షలకుపైగా సభ్యత్వాలు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవడంతో.. వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు.
మూడో స్థానంలో రేవంత్ నియోజకవర్గం..
రాష్ట్రవ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటి వరకు జరిగిన సభ్యత్వ నమోదులో అత్యధికంగా నల్గొండ పార్లమెంట్ స్థానంలో 3.70 లక్షలు సభ్యత్వం పూర్తయ్యి మొదటి స్థానంలో ఉంది. 2.85 లక్షల సభ్యత్వం పూర్తిచేసిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం రెండో స్థానంలో కొనసాగుతుంది. 2.26 లక్షలు సభ్యత్వం పూర్తిచేసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నియోజకవర్గం మేడ్చల్-మల్కాజిగిరి మూడోస్థానంలో ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పూర్తిగా వెనుకబడిన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా చోట్ల సభ్యత్వ కార్యక్రమం అసలు మొదలే కాలేదు.
ప్రత్యేక సమావేశం..
పీసీసీ నిర్దేశించిన గడువు ముగియనుండడంతో.. ఆదివారం.. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన సభ్యత్వ నమోదు సమన్వయకర్తలు, నాయకులతో.. పీసీసీ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటుచేసింది. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వేగం పెంచాలని స్పష్టంచేసింది. పార్లమెంట్ సమావేశాల వల్ల తీరికలేకుండా ఉన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. సమయం ఉన్నప్పుడల్లా వెనుకబడిన నియోజకవర్గాల నాయకులు, సమన్వయకర్తలతో మాట్లాడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.