పల్లెసీమల రూపు రేఖలు మార్చడమే లక్ష్యంగా పల్లెప్రగతి కార్యక్రమాన్ని ఇప్పటి వరకు రెండు దఫాల్లో అమలు చేశారు. రెండు విడతల పల్లెప్రగతి పురోగతిని రేపు జరగనున్న కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు. ప్రధానంగా పచ్చదనం, పారిశుద్ధ్యం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులకు సంబంధించి గ్రామాల్లో పరిస్థితులను సీఎం కేసీఆర్ తెలుసుకోనున్నారు. పల్లెప్రగతికి సంబంధించి ఏర్పాటు చేసిన ఆకస్మిక తనిఖీ బృందాల్లోని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు... తమ పరిశీలనలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వాటిపై కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. పల్లెప్రగతి స్ఫూర్తిని నిరంతరం కొనసాగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయనున్నారు.
త్వరలో పట్టణ ప్రగతి
పురపాలక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో త్వరలోనే పట్టణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పట్టణప్రగతిని పూర్తి స్థాయిలో విజయవంతం చేసి పట్టణాల రూపురేఖలు మార్చేందుకు క్రియాశీలక పాత్ర పోషించాలని కోరనున్నారు. కొత్త పురపాలక చట్టంలో జిల్లా కలెక్టర్లకు ప్రత్యేకాధికారాలు ఉన్నాయి. నూతన చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.
అక్షరాస్యత పెంపు దిశగా
వంద శాతం అక్షరాస్యత లక్ష్యంగా ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన విధానం, కలెక్టర్లు పోషించాల్సిన పాత్ర గురించి వివరించనున్నారు. రెవెన్యూ అధికారుల నుంచి రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు పూర్తి పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెవెన్యూ అధికారులకు ఉన్న విచక్షణాధికారాలకు కళ్లెం వేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేవలు అందించేలా చట్టం తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించి కూడా కలెక్టర్ల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పూర్తి పారదర్శకంగా అమలు చేయడం సహా క్షేత్రస్థాయిలో పాలనను పరుగులు పెట్టించేలా కలెక్టర్లకు ముఖ్యమంత్రి మార్గానిర్దేశం చేయనున్నారు.
ఇదీ చూడండి: రేపు కలెక్టర్ల సదస్సు... సంస్కరణలపై సీఎం దిశానిర్దేశం