తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పట్టణాల్లోనూ రహదారులపైకి వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి.
ఈ క్రమంలో దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పరిస్థితులపై ఆరా తీశారు. వెంటనే వర్షాలపై అక్కడినుంచే సమీక్ష నిర్వహించారు. ఇందులో సీఎస్ సోమేశ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కేసీఆర్.. అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేసి రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు.
"ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభావితమయ్యే విద్యుత్తు, రోడ్లు, నాళాలు తదితరాల పరిస్థితి పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. పురపాలక, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, సిబ్బందిని అప్రమత్తం చేయాలి. భారీ ఎత్తున వరద పోటెత్తుతుండటం వల్ల రాష్ట్రంలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలి."
- కేసీఆర్, ముఖ్యమంత్రి
వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసుకోవాలని కేసీఆర్ చెప్పారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకునేందుకు ప్రజాప్రతినిధులు వారి వారి నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎడతెగని వర్షాల నేపథ్యంలో ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు.
సీఎం సమీక్ష అనంతరం.. సీఎస్ సోమేశ్ కుమార్ వర్షప్రభావిత జిల్లాల్లో రక్షణ చర్యలపై అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే ఆ జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. కలెక్టర్లు, అధికారులతో మాట్లాడి వర్షాలు, వరదల పరిస్థితిపై సమీక్షించనున్నారు. ప్రజలను అప్రమత్తం చేసి.. సహాయక చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు.