కేంద్రం భయపెడితే తాను భయపడతానా అని ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana CM KCR) అన్నారు. తాను భయపడితే.. తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. వానాకాలం పంట కొంటారా.. కొనరా(paddy procurement) తేల్చిచెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. యాసంగిలో వరి వేయమంటారా.. ముక్కు నేలకు రాస్తారా అని అడిగారు. ఇది రైతుల జీవన్మరణ సమస్య అని పేర్కొన్నారు. కర్షకులు నష్టపోకూడదనే తెరాస ఆరాటమని.. అందుకే తమ ఈ పోరాటమని స్పష్టం చేశారు. ప్రతిగ్రామంలో చావుడప్పు కొడతామని అన్నారు. పోరాటం చేయడంలో దేశంలో తెరాసను మించిన పార్టీ లేదని ఉద్ఘాటించారు.
దేశ రైతుల సమస్యపై తెరాస నాయకత్వం
దేశంలోని రైతుల సమస్యపై తెరాస నాయకత్వం తీసుకుంటుందని కేసీఆర్(Telangana CM KCR) స్పష్టం చేశారు. దేశ రైతుల సమస్యల పరిష్కారం కోసం నేతృత్వం వహిస్తానని తెలిపారు. రాష్ట్రసాధనలో పదవులను తృణప్రాయంగా వదులుకున్నామన్న సీఎం(telangana cm kcr).. ఎన్నికలు వచ్చినప్పుడల్లా భాజపా.. మతవిద్వేషాలు రెచ్చగొట్టి కాలం గడుపుతోందని విమర్శించారు. సర్జికల్ స్టైక్ వంటి నాటకాలు బయటికొచ్చాయని.. ప్రజలకు తెలిశాయని అన్నారు. కేంద్రం ధాన్యం తీసుకోకపోతే.. దిష్టితీసి భాజపా కార్యాలయంపై కుమ్మరిస్తామని హెచ్చరించారు.
ఇష్టం లేకున్నా వరి వద్దన్నాం..
దేశాన్ని పాలించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీఎం కేసీఆర్(Telangana CM KCR) అన్నారు. తెరాస సర్కార్ తీసుకొచ్చిన సాగు విధానాలతో రాష్ట్ర రైతులోకం ఒక దరికి వచ్చిందని ఉద్ఘాటించారు. ధాన్యం కొనుగోలు(paddy procurement issue) చేయబోమని కేంద్రం చెప్పిందన్న ముఖ్యమంత్రి.. కేంద్రం తీరుతోనే ధాన్యం సాగు వద్దని చెప్పామని స్పష్టం చేశారు. ఇష్టం లేకున్నా తెలంగాణ రైతులను వరి వేయొద్దన్నామని.. దానికి ప్రత్యామ్నాయ పంటలు వేయమని కోరినట్లు తెలిపారు.
"మా ఓపికకు ఓ హద్దు ఉంటుంది. సాఫ్ సీదా ముచ్చట.... వడ్లు కొంటరా.. కొనరా..? రైతులు కొత్త కోరికలు కోరడం లేదు. పండించిన పంట కొంటారా.. కొనరా అనే అడుగుతున్నారు. కేంద్రం అడ్డగోలు మాటలు మాట్లాడుతోంది. రైతుల గోస.. తెలంగాణలోనే కాదు దేశ్యవ్యాప్తంగా ఉంది. ఏడాదిగా దేశవ్యాప్తంగా రైతులు నిరసన చేస్తున్నారు. సాగు చట్టాలు వద్దని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిజాలు చెప్పలేక కేంద్రం అడ్డగోలు వాదనలు చేస్తోంది. దేశంలో 40 కోట్ల ఎకరాల భూములు ఉన్నాయి. దేశంలో అద్భుతమైన శాస్త్రవేత్తలు ఉన్నారు. బంగారం పండే భూములను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు?. రైతులను బతకనిస్తారా? బతకనివ్వరా?"
- కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి
పాకిస్థాన్ కంటే దిగువన ఉన్నాం..
భారత్ ఆకలి రాజ్యమని ఆకలి సూచీలో సూచిస్తోందని కేసీఆర్(Telangana CM KCR) అన్నారు. ఆకలి సూచీలో పాకిస్థాన్ కంటే దిగువన భారత్ ఉందని తెలిపారు. ఉత్తరభారత రైతులు దిల్లీలో ఆందోళనలు(farmers protest in Delhi) చేస్తున్నారని చెప్పారు. ఆందోళన చేస్తున్న రైతులపైకి కార్లు ఎక్కించి చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర భారత్‌ను వదిలి ఇప్పుడు కేంద్రం చూపు దక్షిణ భారత్ వైపు పడిందన్న సీఎం.. తెలంగాణ రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.
"కేసీఆర్ వచ్చాక విద్యుత్ సమస్య ఎలా పరిష్కారమైంది? సమర్థత ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంది. దేశంలో ఎప్పుడూ 2 లక్షల మెగావాట్లు మించి వాడలేదు. మన రాష్ట్రంలో తప్ప నిరంతర విద్యుత్ ఎక్కడా ఇవ్వట్లేదు. ఇది ఎవరి చేతగానితనం..? ఎవరి అసమర్థత..?. విద్యుత్ ఇవ్వడం చేతకాక మోటార్లు పెడతామంటారు. రాష్ట్రంలో మీటర్లు లేవు.. నీటి తీరువా లేదు. నిరంతర విద్యుత్, రైతుబంధు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. పంట విస్తీర్ణంపై మేం అబద్దాలు చెబుతున్నామని కేంద్రం అంటోంది. పంట పండకపోతే.. కల్లాల వద్దకు భాజపా నేతలు ఎందుకు వెళ్తున్నారు? అసమర్థులకు చరమగీతం పాడితేనే దేశానికి విముక్తి. దేశ సమస్యలపై పోరాటానికి తెలంగాణ నాయకత్వం వహించాల్సిందే. మరో పోరాటం చేయకపోతే.. దేశానికి విముక్తి లేదు."
- కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి