KCR Delhi Tour Updates : దిల్లీలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. సోమవారం ఆయన దంత చికిత్స చేయించుకున్నారు. వ్యక్తిగత వైద్యురాలు పూనియా ముఖ్యమంత్రికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఓ దంతాన్ని తొలగించారు. దంత చికిత్సకు వెళ్లే ముందు తుగ్లక్ రోడ్డులోని ఆయన నివాసంలో తెరాస ఎంపీలు కలిశారు. వారితో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. ధాన్యం సేకరణ అంశంపై పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించేలా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై ఉభయ సభల్లో ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చినట్లు ఎంపీలు వివరించారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం అవలంబిస్తున్న వైఖరిపై ఎంపీలతో కేసీఆర్ చర్చించారు.
మళ్లీ దిల్లీకి కేసీఆర్.. : ఉప్పుడు బియ్యం కొనేది లేదని తేల్చడంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తెరాస చేపడుతున్న ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 11న దిల్లీలో పార్టీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దీక్షలో పాల్గొంటారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి మూడ్రోజుల పర్యటన మాత్రమే ఖరారైందని.. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. మళ్లీ పదో తేదీన దిల్లీ వెళ్లే అవకాశముందని వెల్లడించాయి.